KTR Ivankaమహిళా అభ్యున్నతి థీమ్ తో హైదరాబాద్ లో సాగిన జీఈఎస్ సమ్మిట్ సాక్షిగా కేసిఆర్ ప్రభుత్వానికి చిక్కు ప్రశ్న ఎదురయ్యింది. ఇప్పటివరకు మహిళా మంత్రి లేరు అనే విమర్శను ఏనాడూ ముఖ్యమంత్రి పట్టించుకోలేదు. కేసీఆర్ శైలి తెలిసిన వారికి ఎవరికైనా అది విచిత్రమైనది ఏమి కాదు. అయితే ఈసారి ఆ ప్రశ్న ఏకంగా జీఈఎస్ లోనే ఎదురయ్యింది.

మహిళా సాధికారత పై పెద్ద ఉపన్యాసం చేస్తున్న కేటీఆర్ ఒక్కసారి గా మీ ప్రభుత్వంలో మహిళా మంత్రి ఎందుకు లేరు అనే ప్రశ్న వచ్చే సరికి కంగుతిన్నారు. మా ప్రభుత్వంలో మహిళా ఎమ్మెల్యేలు లేక అని, దానిపైన ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని ఆయన చెప్పుకొచ్చారు.

అయితే ఈ సమాధానం అంత సంతృప్తికరంగా లేదు అని కేటీఆర్ కు కూడా తెలిసే ఉంటుంది. అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన విమర్శకైనా కేసిఆర్ స్పందిస్తారా? లేదా అనేది చూడాలి. ఎలక్షన్స్ కేవలం ఏడాదిన్నర మాత్రమే ఉన్నాయి. ఇప్పటికే మరో కాబినెట్ విస్తరణ ఉండకపోవచ్చు అనే ఇండికేషన్ ఇచ్చారు ముఖ్యమంత్రి.

ఎన్నికల దగ్గరలో క్యాబినెట్ విస్తరణ అంత తేలిక కాదు కూడా. అయితే ఈ విమర్శను కరెక్ట్ చేసుకుని ఎన్నికలకు వెళ్తే మంచిదే. మరి ఆయన మదిలో ఏముందో మరి? ఆలా చేస్తేనే 150 దేశాల ప్రతినిధుల ముందు మహిళా సాధికారత గురించి చెప్పిన మాటలకు అర్ధం ఉంటుంది.