YV Subba Reddy no ticketజగన్‌ చిన్నాన్న, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డికు ఈ సారి ఒంగోలు ఎంపీ టిక్కెట్ లభించలేదు. ఆయనను కాదని టీడీపీ నుండి తెచ్చిన మాగుంట శ్రీనివాసుల రెడ్డికి టికెట్ ఇచ్చారు జగన్. ఈ చర్యతో వైవీ మనస్తాపం చెంది పది రోజులుగా ఎవరికీ అందుబాటులో లేరు. దీనితో శ్రేణులు ఆందోళనలో ఉన్నాయి. ఒంగోలు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని టంగుటూరులో నిన్న జగన్‌ నిర్వహించిన బహిరంగ సభకు సుబ్బారెడ్డి రాకపోవడం చర్చనీయాంశమైంది.

పులివెందులలో ఈనెల 15న వివేకానందరెడ్డి హత్యకు గురైన సందర్భంలోనూ ముఖ్య నాయకులు అక్కడికి వెళ్లినా, వైవీకి బదులు ఆయన కుమారుడు, సోదరుడు మాత్రమే పరామర్శకు వెళ్లారు. ఈ సారి మీ పై వ్యతిరేకత ఉంది… టిక్కెట్ ఇవ్వలేను… మీరు ఉభయ గోదావరి బాధ్యతలు చూడండి. మీకు రాజ్యసభ సీటిస్తాం… అని జగన్ ఆయనకు చెప్పినా ఆయన సమాధానపడలేదు. పైపెచ్చు గత ఎన్నికలలో తన మీద ఓడిపోయినవాడికి ఇప్పుడు పిలిచి టిక్కెట్ ఇవ్వడం అంటే తనను అవమానించినట్టే అని ఆయన భావిస్తున్నారట.

జగన్‌ గృహప్రవేశానికి హాజరుకాలేదు. ఆయన చేరికకు మూడు రోజుల ముందు నుంచి వైవీ ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అయింది. ఈ పరిణామాల నేపథ్యంలో వైవీ ఎప్పుడు తిరిగి వస్తారు? ఈ ఎన్నికల్లో కీలకంగా పనిచేస్తారా? లేదా?? అనే సందేహాలు ఆ పార్టీ నాయకుల్లో నెలకొన్నాయి. విదేశాలకు వెళ్లారు… రెండు మూడు రోజులలో తిరిగి వచ్చి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటారని వైకాపా నేతలు అంటున్నా ఎవరి అనుమానాలు వారికి ఉన్నాయి. దీనితో ఒంగోలు క్యాడర్ అయోమయంలో ఉంది.