Botsa Satyanarayanaసిట్టింగ్ ఎంపీ బల్లి దుర్గ ప్రసాద్ రావు మరణించడంతో తిరుపతి ఉపఎన్నిక అనివార్యమైంది. సహజంగా ఎవరైనా సిట్టింగ్ ఎంపీ మరణిస్తే ఆయన కుటుంబసభ్యులకు టికెట్ ఇవ్వడం పరిపాటి. చాలా సార్లు అటువంటి సందర్భంగా ప్రతిపక్షాలు ఏకగ్రీవానికి సహకరిస్తూ ఉంటాయి. అయితే తిరుపతి ఉపఎన్నికలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించింది.

దీనిపై సోషల్ మీడియాలో వైఎస్సార్ కాంగ్రెస్ ఎటాక్ మొదలుపెట్టింది. టీడీపీ సంప్రదాయాన్ని తుంగలో తొక్కింది అని ఆరోపించారు. అయితే సొంత పార్టీ వారికే షాక్ ఇచ్చారు ముఖ్యమంత్రి జగన్. దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి టికెట్ ఇవ్వకుండా జగన్ సన్నిహితులెవరికో టికెట్ ఇస్తున్నట్టు సమాచారం.

ఇక అభ్యర్థిని ప్రకటించనప్పటికీ మంత్రి బొత్స సత్యనారాయణ ఈ విషయాన్ని ధృవీకరించారు. “దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి అన్ని విధాలుగా వైయస్‌ఆర్‌ సీపీ అండగా ఉంటుందని పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ భరోసానిచ్చారు. దుర్గాప్రసాద్‌ కుమారుడికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని సీఎం నిర్ణయం,” అని ఆయన చెప్పుకొచ్చారు.

దీనితో దివంగత ఎంపీ బల్లి దుర్గాప్రసాద్‌ కుటుంబానికి టికెట్ ఇవ్వడం లేదు అనే విషయం తేటతెల్లం అయిపోయింది. దానితో ఈ ఎన్నికలలో సింపతీ ఫాక్టర్ అనేది ఉండదు. అయితే ఇటీవలే తెలంగాణలో జరిగిన దుబ్బాక ఉపఎన్నికలో దివంగత ఎమ్మెల్యే సతీమణికి టికెట్ ఇచ్చినా తెరాస ఓడిపోయింది కాబట్టి సింపతీ ఫాక్టర్ అన్ని వేళలా పని చెయ్యదని అధికార పార్టీ చెబుతుంది.