విశాఖపట్నాన్ని కార్యనిర్వాహక రాజధానిగా చెయ్యబోతున్నాం అని, దానితో నగరం రూపు రేఖలే మారిపోతాయని వైఎస్సార్ కాంగ్రెస్ నేతలు తరచు చెబుతారు. కోర్టులను మ్యానేజ్ చేసి చంద్రబాబు అడ్డుకోకపోతే అది ఈ పాటికే జరిగిపోయేదని కూడా ఆదరగొడతారు. అయితే ఆ మేరకు విశాఖపట్నం పట్ల ఆ పార్టీకి ప్రభుత్వానికి నిబద్ధత ఉందా అంటే చేతల్లో కనిపించడం లేదు.
వివరాల్లోకి వెళ్తే.. ఉద్యోగులకు జీతాలివ్వడానికి నానా తంటాలు పడుతున్న రాష్ట్ర ప్రభుత్వం… విశాఖపట్నంలో ఖరీదైన భూములను వేలానికి పెట్టింది. ఇంతకు ముందు కూడా ‘బిల్డ్ ఏపీ మిషన్’ పేరుతో విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు నడుస్తున్న స్థలాలను, పరిశ్రమలకు ఉద్దేశించిన భూములను వేలం వేస్తామని ప్రకటించింది.
బీచ్ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం తో పాటు వివిధ స్థలాల అమ్మకంతో దాదాపుగా 2,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రభుత్వం ఆలోచనగా ఉంది. అయితే దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. బీచ్ రోడ్డులో 13.59 ఎకరాల స్థలం గతంలో చంద్రబాబు ప్రభుత్వం పెద్ద షాపింగ్ కాంప్లెక్స్, స్టార్ హోటల్, కన్వెన్షన్ సెంటర్ నిర్మించేందుకు దుబాయ్‌కు చెందిన లులూ గ్రూపు కు ఇచ్చింది.
ఆ అగ్రిమెంట్ ని రద్దు చేసి పప్పుబెల్లాల కోసం అమ్మకానికి పెట్టడం వివాదాస్పదంగా మారింది. ఆ విషయం కూడా పక్కన పెడితే విశాఖ రాజధానిగా ప్రకటించడం అంటే ప్రభుత్వానికి తన అవసరాల కోసమే చాలా భూమి అవసరం అవుతుంది. అయితే అదేమి పట్టించుకోకుండా ఉన్న భూమిని అమ్ముకోవడమంటే రాజధాని గా పేరుకు మాత్రం ప్రకటించేసి అభివృద్ధి ఏమీ చెయ్యకుండా చేతులు దులిపేసుకుంటుందా ప్రభుత్వం అనే అనుమానాలు అందరిలోనూ ఉన్నాయి.
What’s streaming on
OTT? Consult the experts!




