No Rules for Vijaya Sai Reddyఆంధ్రప్రదేశ్ లో లొక్డౌన్ సామాన్యులకే అధికార పార్టీ నేతలు మాత్రం ఎప్పుడు ఎక్కడికైనా వెళ్లొచ్చు. వైఎస్సార్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి మొన్న ప్రధానమంత్రి పిలుపు మేరకు విశాఖపట్నంలో కాగడాలతో ప్రదర్శన నిర్వహించారు. ఆ తరువాత రోజు ఎవరో పారిశ్రామికవేత్త విరాళం ఇస్తున్నారంటే తాడేపల్లి వెళ్లి సీఎం తో పాటు ఫోటోలకు పోజులు ఇచ్చారు.

నిన్న ఆయన శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి పట్నంలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకూ కరోనా సోకని జిల్లాలు శ్రీకాకుళం, విజయనగరం మాత్రమే. దీనితో ఈ రెండు జిల్లాలను లాక్ చేసేశారు. వేరే జిల్లాల వారు ఇక్కడకి రావడానికి వీలు లేదు. అయితే పార్టీలోను, ప్రభుత్వంలోనూ నెంబర్ 2 అయిన విజయసాయి రెడ్డిని ఆపేదెవరు?

పైగా ఆయన ఒక్కరే కాకుండా ఆయనతో అనుచరులు, కారులు… ఆ హడావిడే ఒక రేంజ్ లో ఉంటుంది. మాస్కులు లేవు అంటేనే ఇప్పటికి ఒక డాక్టర్, ఒక మునిసిపల్ కమిషనర్లను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం ఇక విజయ సాయిరెడ్డిని ఆపితే ఇంకేమైనా ఉందా? మొన్న ఆ మధ్య తెలంగాణ నుండి వచ్చిన ఆంధ్ర వారిని మూడు రోజుల పాటు సరిహద్దుల వద్ద నిలబెట్టింది ప్రభుత్వం.

నిన్నటికి నిన్న గల్ఫ్ నుండి హైదరాబాద్ ఎయిర్ పోర్టులో దిగిన వారు 14 రోజులు అక్కడ ఐసొలేషన్ లో ఉండి వచ్చినా ఇక్కడ ఇంకో పద్నాలుగు రోజులు ప్రభుత్వ ఐసొలేషన్ వార్డులో ఉండాల్సిందే అని ప్రభుత్వం చెప్పింది. బహుశా వారు విజయసాయి రెడ్డి లాగా పరపతి కలిగినవారు కాదు అనేమో? ఇది ఇలా ఉండగా… ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటివరకు 365 కేసులు నమోదు అయ్యాయి.