No Reaction From Pushpa Teamఆంధ్రప్రదేశ్ లోని టికెట్ ధరల విషయంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ పోరాడలేక చేతులెత్తేసిన విషయం తెలిసిందే. పవన్ కళ్యాణ్, నాని తప్ప దీనిపై స్పందించే హీరోలే కరువవ్వగా, వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి చేసిన ‘బలుపు’ వ్యాఖ్యలపై మాత్రం ఒకరిద్దరు నిర్మాతలు తమ స్వరాన్ని బలంగా వినిపించారు.

మొత్తమ్మీద గమనిస్తే… సినిమా వాళ్ళు కూడా వారి పొలిటికల్ మైలేజ్ కోసమో లేక మరొక పార్టీకి దాసోహం చేయడానికో బయటకు వస్తారు తప్ప, నిజంగా వారికి దక్కాల్సిన హక్కులపై గానీ, వారిని పరమ చెత్తగా ఎవరైనా పొలిటికల్ లీడర్స్ అభివర్ణించినా ఏ ఒక్కరూ నోరెత్తరన్న విషయం స్పష్టమవుతోంది.

తాజాగా ఓ టీఆర్ఎస్ నేత ఓ బహిరంగ వేదిక మీద చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ‘అమ్మాయిలు మాత్రం సిన్సియర్ గా కూర్చున్నారు, అబ్బాయిలు మాత్రం ‘పుష్ప’లో హీరో అనుకుంటున్నాడేమో వాడు,వాడ్ని చక్కగా పెట్టుండ్రి, ఏయ్ జరుపురా బిడ్డా… అని అన్నారు.

ఇక్కడ వరకు కంట్రోల్ లోనే అంతా అదుపులోనే ఉంది. ఈ హౌలే గాళ్ళందరినీ ‘తగ్గేదేలే’ అని హీరోలను చేసినాక, పిల గాళ్లనీ కంట్రోల్ చేసుడు కష్టమైపోయింది. ఫస్ట్ ఈ సినిమాలు తీసే వెధవలను చెప్పుతోనే కొట్టాలి అంటూ తీవ్రంగా స్పందించారు టీఆర్ఎస్ నేత.

అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోపై ప్రత్యక్షంగానే అంత మాట అనగా, ‘పుష్ప’ సినిమా దర్శకనిర్మాతలపై కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసారు. కానీ టాలీవుడ్ నుండి ఇప్పటివరకు ఏ ఒక్కరూ దీనిని ఖండించలేదు, కనీసం స్పందించలేదు.

గతంలో ఓ చిన్న అవార్డు కోసం ప్రభుత్వాన్ని రోడ్డుకీడ్చిన ఘనత మన తెలుగు సినిమా ప్రముఖులది. ముఖ్యంగా బన్నీ పేరునే పెట్టుకున్న బన్నీ వాసు నంది అవార్డుల విషయంలో నాటి టీడీపీ ప్రభుత్వాన్ని ఎలా ఇరుకున పెట్టారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మరి ఇప్పుడు ఏకంగా బన్నీ గురించే అసభ్య పదజాలాన్ని ప్రయోగిస్తుంటే… వింటూ ఊరుకోవడం అనేది తెలుగు సినిమా వాళ్ళు చేసే రాజకీయానికి నిదర్శనమా? అసలు రాజకీయ నేతలను మించి టాలీవుడ్ ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలు చేయడంలో నేర్పరులుగా మారారా?

అందరికీ ఈ సూత్రాన్ని అనుసంధించలేము గానీ, సినిమా వాళ్ళ రాజకీయం కూడా మాములుగా ఉండదన్న విషయం గతేడాదిలో ముగిసిన ‘మా’ ఎన్నికలు చెప్పకనే చెప్పాయి. అందుకే సినీ ఇండస్ట్రీకి వ్యతిరేకంగా జగన్ ఎన్ని నిర్ణయాలు తీసుకుంటున్నా, ఓ వర్గం ప్రజలు మాత్రం టాలీవుడ్ వర్గాలపై ఏ మాత్రం కనికరం చూపించడం లేదు.

ఇండస్ట్రీలో పొలిటిక్స్ ప్రదర్శించడానికి చూపుతున్న శ్రద్ధ, సినీ అభివృద్ధికి గానీ, అనుచిత వ్యాఖ్యలు చేసిన వారికి కౌంటర్ ఇవ్వడానికి చూపడం లేదనేది గమనించదగ్గ అంశం. బహుశా ఈ అనుచిత వ్యాఖ్యలను వైసీపీ, టీఆర్ఎస్ నేతలు కాకుండా, ఇతర పార్టీ వ్యక్తులైతే ఈ పాటికి జరిగే రచ్చ ఊహలకంది ఉండేది కాదు.

చొక్కా ఎగరేసుకుంటూ మాట్లాడే పోసాని కృష్ణ మురళీ అయితే ఈ పాటికి ఇతర పార్టీ నేతలకు ఛాలెంజ్ లు, సవాళ్ళు వేసేయడం వంటివి జరిగిపోయేవి. కానీ అంటున్నది ఏపీలోని జగన్ అనుచరణగం, తెలంగాణలోని టీఆర్ఎస్ నేతలు కావడంతో, ‘లైట్’గా తీసుకున్నట్లుగా కనపడుతోంది.