janasena-pawan-kalyan-no-public-meetingఅవును… ఇప్పుడిప్పుడే బహిరంగ సభల ద్వారా రాజకీయంగా యాక్టివ్ అవుతున్న ‘జనసేన’ అధినేత పవన్ కళ్యాణ్… అభిమానుల గుండెల్లో ఒక బాంబు పేల్చారు. అదేమిటంటే… ఇక ముందట బహిరంగ సభలను ఏర్పాటు చేయరంట. స్వయంగా పవన్ కళ్యాణే ఈ విషయాన్ని తెలిపారు. కాకినాడ సభలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత ఈ నిర్ణయాన్ని వెల్లడించారు పవన్ కళ్యాణ్. అయితే ఒక రకంగా ఇదొక షాకింగ్ లాంటి వార్త.

ఒక అభిమాని ప్రాణాలు కోల్పోవడం అనేది పవన్ కు నిజంగా బాధ కలిగించే విషయమే. అందులో మరో ఆలోచనకు తావు లేదు. ఆర్ధిక పరంగా 5 లక్షలు ఇచ్చినా, మానసికంగా ఎంత ఓదార్చినా ఆ కుటుంబంలో జరగరానిదే జరిగింది. దీనికి పరోక్షంగా పవన్ కళ్యాణ్ కారకుడు అవుతాడేమో కానీ, ప్రత్యక్షంగా కాదన్న విషయాన్ని పవన్ తెలుసుకోవాలి. బహిరంగ సభకు వచ్చిన వారు ఎవరి భద్రత వారు చూసుకోవాలి. ఇది కూడా ఒక సామాజిక బాధ్యత. అలాగే తన కార్యకర్తలకు ఒక క్రమశిక్షణ అలవాటు చేయాలి.

కానీ, ఆ దిశగా ఆలోచనలు చేయకుండా అసలు సభ పెట్టకుండా ఉంటే ఎవరూ రారు కదా… ఏమీ జరగదు కదా అంటే… అది సరైన పద్ధతి కాదు. ముఖ్యంగా రాజకీయ జీవితంలో ఇది ఆచరణకు సాధ్యం కాని విషయం. ఇక్కడే మరో ఉదాహరణ కూడా చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ “పంజా” సినిమా ఆడియో విడుదల సమయంలో కూడా ఒక అభిమాని ఇలాగే దుర్మరణం పాలైన విషయం తెలిసిందే. మరి అప్పటినుండి పవన్ ఆడియో వేడుకలను కూడా బహిష్కరించాలి కదా?!

మొన్నటి ‘సర్ధార్ గబ్బర్ సింగ్’ వరకు ఆడియో వేడుకలను విజయవంతంగా నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే ఆడియో వేడుక ముగింపు సమయంలో… ఇంటికి జాగ్రత్తగా వెళ్ళమని అభిమానులకు పిలుపునిచ్చేవారు. ఇంకా చెప్పాలి అంటే… సినిమా టికెట్ల కోసం క్యూలలో నిల్చుని, ఎగబడి మరణించిన అభిమానుల సంఖ్యకు కొదవలేదు. పవన్ కళ్యాణ్ సినిమాలకు కూడా చాలా సందర్భాలలో జరిగాయి. మరి అప్పుడే పవన్ సినిమాల నుండి వైదొలగాల్సింది కదా!

ఏదైనా ఒక ఉదంతం జరిగినపుడు దానిని అధిగమించే విధంగా తదుపరి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుని ముందుకు సాగాలి అని ఆలోచనలు చేసుకోవాలే గానీ, ఇలా నిరుత్సాహంలోకి వెళ్ళిపోతే “నాయకుడు”గా పవన్ ఎప్పుడు ఎదుగుతాడు? ‘జనసేన’ను ఎప్పుడు ప్రజల్లోకి తీసుకువెళ్తాడు? ఇప్పటికే ప్రజా జీవితంలో వచ్చి మెగాస్టార్ చిరంజీవి నవ్వుల పాలయ్యారు, అవుతూనే ఉన్నారు కూడా! చివరికి… పవన్ కళ్యాణ్ కూడా అదే బాటలో నడుస్తాడేమో అన్న ఆందోళన అభిమానుల్లో వ్యక్తమవుతోంది.