YS_Jagan_Mohan_Reddy_ACB_14400_Mobile_APPదేశంలో అవినీతికి తావులేకుండా పాలన సాగుతున్న రాష్ట్రాలలో ఆంద్రప్రదేశ్‌ అగ్రస్థానంలో ఉందని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసిపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ చెపుతుంటారు. నిజమే అయ్యుండవచ్చని ప్రజలు కూడా అనుకుంటారు. అయినా ఎక్కడో అక్కడ అవినీతి జరుగుతూనే ఉందని ప్రభుత్వమే భావిస్తుంటుంది. అందుకే ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలో తన క్యాంప్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ-14400 మొబైల్ యాప్‌ను ప్రారంభించారు.

రాష్ట్ర ప్రజలందరూ గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఈ యాప్‌ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్‌లోడ్‌ చేసుకొని, ఏ ప్రభుత్వ కార్యాలయం, సచివాలయంలోనైనా ఏ అధికారి, ఉద్యోగి అయినా లంచం అడిగితే వెంటనే ఏసీబీ-14400 మొబైల్ యాప్‌ బటన్ నొక్కి వారి మాటలు రికార్డ్ చేస్తే చాలు, ఆ వివరాలు నేరుగా అవినీతి నిరోధక శాఖకు, అక్కడి నుంచి సిఎంవోకు చేరిపోతాయని ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వాసుపత్రులలో సిబ్బంది, 104, 108 సిబ్బంది లంచాలు అడిగినా కూడా ఈ ఏసీబీ-14400 మొబైల్ యాప్‌ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని డిజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. ఈ ఏసీబీ-14400 మొబైల్ యాప్‌ ద్వారా ఆడియో, వీడియో సంభాషణలే కాకుండా, ఫిర్యాదులకు సంబంధించి డాక్యుమెంట్లను, ఫోటోలను కూడా పంపించవచ్చని చెప్పారు.

అవినీతిని ఇంత సులువుగా అంతం చేయగలిగేమాటైతే దేశంలో ఏనాడో అవినీతి అంతమైపోయి ఉండేది. కానీ కంటికి కనబడని కరోనాలాగ నేటికీ అవినీతి దశదిశల వ్యాపించి ఉంది. అవినీతికి పాల్పడేవాడు తాను అవినీతిపరుడిని అనుకోడు కనుకనే ఒకవేళ పట్టుబడినా కోర్టుకు వెళ్ళి న్యాయపోరాటాలు చేస్తుంటాడు. మళ్ళీ తిరిగివచ్చు అదే కుర్చీలో కూర్చొంటాడు.

ప్రభుత్వ కార్యాలయాలలో జరిగే అవినీతిని అంతం చేసేందుకు ఏసీబీ-14400 మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టడం అభినందించాల్సిందే. అయితే ఎమ్మెల్యేలు, మంత్రులు, స్థాయిలో అసలు అవినీతి జరగడం లేదని, వారందరూ నీతినిజాయితీపరులేనని, కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే వారు ఎన్నికల సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఎవరూ అనుకోవడం లేదు. కనుక ముందుగా ఆ స్థాయిలో జరిగే భారీ అవినీతిని అరికట్టగలిగితే రాష్ట్రానికి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది. ఆ స్థాయి అవినీతిపరుల కోసం కూడా ప్రత్యేకంగా ఏమైనా మొబైల్ యాప్‌ లేదా నిఘావ్యవస్థను ఏర్పాటు చేస్తే బాగుంటుంది.

అయినా అక్రమాస్తుల కేసులో ఎ-1 ముద్దాయిగా ఉండి, జైలులో 16 నెలలు గడిపి వచ్చిన వ్యక్తి అవినీతిని రూపుమాపడం గురించి ఉపన్యాసాలు ఇవ్వడం, దాని కోసం మొబైల్ యాప్‌ను ప్రారంభించడం చాలా విచిత్రంగానే ఉంది కదా?