No Permissiion given for Amaravati Farmers padayatraఅమరావతినే రాజధాని చేయాలని, హైకోర్టు ఆదేశం ప్రకారం నిర్మాణ పనులు మొదలుపెట్టాలని కోరుతూ రాజధాని రైతులు మూడేళ్ళుగా ఆందోళనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో తమ ఉద్యమానికి రాష్ట్ర ప్రజల మద్దతు కూడగట్టేందుకు ఈ నెల 12వ తేదీన మరోసారి అమరావతి నుంచి శ్రీకాకుళం జిల్లాలోని అరసవిల్లి వరకు మహాపాదయాత్ర చేసేందుకు సిద్దమయ్యారు. దీనికి పోలీసుల అనుమతి కోరుతూ అమరావతి పరిరక్షణ సమితి ప్రధాన కార్యదర్శి గద్దె తిరుపతిరావు లేఖ వ్రాశారు. దానికి అనుమతి నిరాకరిస్తున్నట్లు డిజిపి రాజేంద్రనాథ్ రెడ్డి గురువారం అర్దరాత్రి లిఖితపూర్వకంగా జవాబు పంపించారు.

దానిలో ఆయన ఏమి చెప్పరంటే, ఇదివరకు కూడా శాంతిభద్రతలకు భంగం కలిగించమని హైకోర్టుకి హామీ ఇచ్చి అమరావతి నుంచి తిరుపతికి మహాపాదయాత్ర చేసారు. కానీ పాదయాత్రలో విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడులు చేసారు. పలుచోట్ల స్థానికులతో ఘర్షణలు పడ్డారు. శాంతి భద్రతలకు భంగం కలిగించినందుకు మీపై 71 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. వాటిలో రెండు కేసులకు శిక్షలు కూడా అనుభవించారు.

మళ్ళీ ఇప్పుడూ అటువంటి హామీలే ఇచ్చి అనుమతి కోరుతున్నారు. గతంలో మీ పాదయాత్రలో జరిగిన సంఘటనలను, ఇటీవల ఘర్షణలు జరిగిన కోనసీమ, శ్రీకాకుళం జిల్లాల గుండా మీరు పాదయాత్ర చేయడం వలన మళ్ళీ శాంతిభద్రతలకు భంగం కలగవచ్చునని ఆయా జిల్లాల పోలీస్ ఉన్నతాధికారులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కనుక మీ పాదయాత్రకు అనుమతి నిరాకరిస్తున్నామని తెలియజేస్తున్నాము, అని లేఖలో పేర్కొన్నారు.

రాజధాని నిర్మాణం కోసం రైతులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం శాంతిభద్రతల సమస్యగా పరిగణిస్తుండటం చాలా బాధాకరం. రాజధాని కోసం వారు తమ జీవనోపాదిగా ఉండే భూములను త్యాగాలు చేసినందుకు ప్రభుత్వం వారిని గౌరవించాలి. సన్మానించాలి. కానీ వైసీపీ ప్రభుత్వం వారిచ్చిన భూములలోనే కట్టిన సచివాలయం నుంచి పాలిస్తూ, వారి భూములను అమ్ముకొంటూ వారిని అవమానిస్తోంది. అవహేళన చేస్తోంది.

వైసీపీ ప్రభుత్వం అమరావతిని నిర్మించకూడదనుకొంటోంది కనుక వారిని శాంతి భద్రతలకు భంగం కలిగించాలని కుట్రలు చేస్తున్న ఆందోళనకారులుగా పరిగణిస్తోంది. ఆనాడు బ్రిటిష్ పాలకులు స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న భారతీయులను ఈవిదంగానే పరిగణించి వ్యవహరించారు. తెలంగాణ కోసం పోరాడిన ప్రజలపట్ల అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇలాగే ప్రవర్తించింది. కానీ చివరికి ఏం జరిగిందో అందరికీ తెలుసు. ఇప్పుడూ అదే జరుగుతోంది. కనుక దాని ఫలితం కూడా అలాగే వస్తుంది.