No party in AP has the courage to defy Modi Undavalli Arun kumarమాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్‌ మొన్న ఆదివారం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమైన సంగతి తెలిసిందే. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, “ప్రస్తుతం దేశంలో పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, తెలంగాణ సిఎం కేసీఆర్‌ మాత్రమే ధైర్యంగా ప్రధాని నరేంద్రమోడీని ఎదిరిస్తున్నారు. మత రాజకీయాలతో దేశ ప్రజల మద్య చిచ్చు రగిలిస్తున్న బిజెపిని అడ్డుకోవలసిన సమయం ఆసన్నమైందని సిఎం కేసీఆర్‌ చెప్పారు. అందు కోసమే కేసీఆర్‌ జాతీయ రాజకీయాలలో ప్రవేశించాలనుకొంటున్నారు,” అని చెప్పారు.

ఈ సందర్భంగా ఉండవల్లి అరుణ్ కుమార్‌ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల పరిస్థితిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ఏపీలో బిజెపి అధికారంలోకి రాలేకపోవచ్చు. కానీ ఏ పార్టీ అధికారంలో ఉన్న బిజెపి కనుసన్నలలో పనిచేయాల్సిందే. చంద్రబాబు నాయుడు మొదట మోడీని తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ ఆ తరువాత చల్లబడిపోయారు. సిఎం జగన్మోహన్ రెడ్డి తన అక్రమాస్తుల కేసులు, నిధుల కోసం ప్రధాని నరేంద్రమోడీకి విధేయంగా మెలగకతప్పదు. జనసేన పార్టీ బిజెపితోనే ఉంది. కనుక ఆంధ్రప్రదేశ్‌లో టిడిపి, వైసీపీ, జనసేన పార్టీలు బలంగా ఉన్నప్పటికీ అవి మూడు బిజెపిని కాదనలేని పరిస్థితులు నెలకొన్నాయి. కనుక ఏపీలో బిజెపి బలంగా ఉన్నట్లే భావిస్తున్నాను,” అని అన్నారు.

ఉండవల్లి చెప్పినది నిజమని రాష్ట్రపతి ఎన్నికతో మరోసారి నిరూపితమవుతుంది. ఆ ఎన్నికలో ఎన్డీయే అభ్యర్ధికి వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఓట్లు వేయడం ఖాయం. బిజెపిని కాదని కేసీఆర్‌ లేదా మమతా బెనర్జీలతో చేయి కలిపి బిజెపికి పోటీగా వారు నిలబెడుతున్న అభ్యర్ధికి ఓట్లు వేసే ధైర్యం వైసీపీకి లేదనే చెప్పవచ్చు.