TRS - Harish -Raoముఖ్యమంత్రి కేసీఆర్ సొంత నియోజకవర్గంలో ఎదురు గాలి వీస్తుంది అనే వార్తలు మనం చూస్తూనే ఉన్నాం. మహాకూటమి వల్ల కాంగ్రెస్ కు టిక్కెట్ల పంపకం కష్టతరంగా మారింది. చాలా వరకు నియోజకవర్గాలలో ముగ్గురు నలుగురు కూడా టిక్కెట్లు ఆశిస్తున్నారు. అయితే వీటి అన్నిటికి బిన్నంగా ఉంది పరిస్థితి మంత్రి హరీష్ రావు సొంత నియోజకవర్గం సిద్దిపేటలో.

ఈ నియోజకవర్గంలో పోటీ చెయ్యడానికి కాంగ్రెస్ నుండి ఎవరూ ముందుకు రావడం లేదు. కోదండరాం పార్టీకు ఎలాగూ ఇన్ని సీట్లు ఇవ్వాలని ఉంది గనుక ఆ సీటు ఆ పార్టీకి ఇచ్చి చేతులు దులిపేసుకుందని చూస్తుంది కాంగ్రెస్. కచ్చితంగా ఓడిపోతామని తెలిసి తెలిసి ఆ సీటును తీసుకోవడం ఎందుకు? డిపాజిట్‌ కోల్పోయి పరాభవం పాలవడం ఎందుకు? అని కోదండరామ్ పార్టీ వారు అనుకుంటున్నారట.

2004 ఎన్నికల్లో కేసీఆర్‌.. సిద్దిపేట అసెంబ్లీతో పాటు కరీంనగర్‌ లోక్‌సభ స్థానానికి కూడా పోటీచేశారు. రెండుచోట్లా గెలిచిన ఆయన.. అనంతరం సిద్దిపేటను వదులుకున్నారు. అప్పట్లో సిద్దిపేటకు జరిగిన ఉప ఎన్నికల్లో హరీశ్‌రావు తొలిసారిగా పోటీ చేసి.. దాదాపు 25వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అది మొదలు.. ప్రతిసారి ఆయన తన మెజారిటీని పెంచుకుంటూ వచ్చారు.

2008 ఉపఎన్నికల్లో 59వేల ఓట్ల మెజారిటీని, 2009లో 64 వేల ఓట్ల మెజారిటీని, 2010లో 93వేల ఓట్ల మెజారిటీని సాధించారు. గత ఎన్నికల్లో 96వేల ఓట్ల పైచిలుకు ఓట్లతో గెలుపొందారు. తద్వారా సిద్దిపేటను తెరాసకు కంచుకోటగా మార్చేశారు. ఈసారి గెలిచి డబల్ హ్యాట్ట్రిక్ పూర్తి చెయ్యబోతున్నారు. ఒక్క సిద్దిపేటలోనే ఇటువంటి ప్రత్యేక పరిస్థితి ఉండటం హరీష్ అంటే ఏమిటో తెలియజేస్తుంది.