Yeddyurappaయడియూరప్ప ప్రభుత్వం సోమవారం బల నిరూపణ చేసుకోవాల్సి ఉండగా కర్ణాటకీయం అనూహ్య మలుపు తిరిగింది. రాజీనామా చేసిన ఎమ్మెల్యేలపై స్పీకర్‌ రమేశ్‌ కుమార్ అనర్హత వేటు వేశారు. మొత్తం 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడింది. 17 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటంతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 207కు పడిపోయింది. ఇప్పుడు అసెంబ్లీ లో మేజిక్‌ ఫిగర్‌ 105 అయ్యింది. అసెంబ్లీలో బీజేపీ సంఖ్యా బలం 105 కావడంతో బలనిరూపణ సునాయాసమే.

కాంగ్రెస్‌+జేడీఎస్‌ సభ్యులు 99 ఉన్నారు. అలాగే ఇండిపెండెంట్లు ముగ్గురు ఉన్నారు. వారిలో ఇద్దరు బీజేపీకి మద్దతు ఇస్తున్నారు. ఏదైనా అనూహ్య పరిణామం చోటు చేసుకుంటే తప్ప ప్రస్తుతానికి యడియూరప్ప సర్కార్‌కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు తెలిపారు. స్పీకర్ నిర్ణయాన్ని వ్యూహాత్మక ఎత్తుగడగా చెబుతున్నారు విశ్లేషకులు. రెబల్ ఎమ్మెల్యేలకు మంత్రిపదవులు దక్కకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతేగాక బీజేపీకి వారు మద్దతు ఇచ్చే అవకాశం కూడా ఉండటంతో వారిపై అనర్హత వేసినట్టుగా చెబుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్‌+జేడీఎస్‌ ప్రభుత్వాన్ని కూలదోసిన రెబెల్స్ 2023 ఎన్నికల వరకు ఎన్నికల్లో పోటీ చేసే అవకాశమే లేదు. దీనితో ఉన్నదీ పోయే… కోరుకున్నదీ పోయే అన్నట్టు అయ్యింది రెబెల్స్ పరిస్థితి. కొత్తగా ఏర్పాటైన యడియూరప్ప సర్కారు రేపు విశ్వాస పరీక్ష ఎదురుకుంటుంది. దీనితో దక్షిణాదిన మొదటి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అయినట్టుగా అయ్యింది.