SS Rajamouliఇంతింతై వటుడింతై అన్నట్టు స్టూడెంట్ నెంబర్ వన్, సింహాద్రి లాంటి కమర్షియల్ ఎంటర్ టైనర్లతో కెరీర్ మొదలుపెట్టిన రాజమౌళి ఇవాళ దేశం మొత్తం గర్వించే స్థాయిలో ఆర్ఆర్ఆర్ కీర్తిని అంతర్జాతీయ వీధుల్లో సగర్వంగా నిలబెడతాడని ఎవరూ ఊహించి ఉండరు. ఇండస్ట్రీ రికార్డులు ఎందరో సృష్టించారు. టాలీవుడ్ పుస్తకాల్లో సువర్ణాక్షరాలతో రాయదగ్గ ఎన్నో క్లాసిక్స్ ఇచ్చారు. శంకరాభరణం లాంటివి పలు ఇంటెర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్స్ లో ప్రదర్శనకు నోచుకుని విదేశీయులతో చప్పట్లు కొట్టించుకున్నాయి. కానీ రాజమౌళి సంగతి వేరు.

హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ ప్రకటించిన అవార్డుల్లో ఏకంగా నాలుగు సొంతం చేసుకోవడమంటే మాటలు కాదు. గొప్ప ఘనత ఇది. తారకరత్న హఠాన్మరణం వల్ల జూనియర్ ఎన్టీఆర్ వెళ్లలేకపోయాడు కానీ ఇవాళ స్టేజి మీద రామ్ చరణ్ రాజమౌళి కీరవాణిలు పురస్కారాన్ని అందుకుంటున్న క్షణం గురించి ఎంత చెప్పినా తక్కువే. గొప్ప గొప్ప హాలీవుడ్ బ్లాక్ బస్టర్లతో పోటీ పడి ఇన్ని విభాగాల్లో గెలవడమంటే మాటలు కాదు. ఇంకో రెండు వారాల్లో జరగబోయే ఆస్కార్ లోనూ మనం జెండా ఎగరవేయబోతున్నామని చెప్పడానికి ఇది సంకేతమే.

Also Read – ఇదేం ఖర్మ…ఇదేం తడబాటు… ఇదేం పలాయనం?

ఇదంతా బాలీవుడ్ దిగ్గజాలకు కునుకు రానివ్వడం లేదు. పఠాన్ నెల దాటకుండానే వెయ్యి కోట్లు వసూలు చేసింది. అలా అని ఏ ఫారినరూ ఇది గొప్ప చిత్రమని కితాబివ్వలేదు. కనీసం బాగుందని ట్వీట్లు చేసిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఇదో సాధారణ యాక్షన్ స్పై థ్రిల్లర్. బోలెడన్ని లోపాలతో ఏదో షారుఖ్ ఖాన్ ఇమేజ్ పుణ్యమాని యావరేజ్ కంటెంట్ సైతం అంత కలెక్షన్లను రాబట్టింది. ఇప్పుడు కాదు ఇంకో ఆరు నెలల తర్వాతైనా పఠాన్ ను విదేశీ క్రిటిక్స్ గుర్తించడం అసాధ్యం. టామ్ క్రూజ్ రియల్ స్టంట్లు చూసినవాళ్లకు మన హెలికాఫ్టర్ విఎఫెక్స్ షాట్లు నచ్చుతాయా.

ఒకటి మాత్రం నిజం. రాజమౌళి తనను తానే అధిగమించాలి తప్ప ఇంకెవరు అందుకోలేరు అనే స్థాయిలో మార్కెట్ ని పెంచుకుంటున్నారు. జేమ్స్ క్యామరూన్ అంతటి వాడే నీకిక్కడ సినిమా తీయాలని ఉంటే చెప్పు మాట్లాడుకుందాం అని నోటిమాటగా అనలేదు. సుభాష్ ఘాయ్, రాజ్ కుమార్ హిరానీ, యష్ చోప్రా లాంటి దిగ్గజాలకే ఇలాంటివి కలలో కూడా జరగలేదు. ఆర్ఆర్ఆర్ జపాన్ లో ఇంకా ఊచకోత కొనసాగిస్తూనే ఉంది. కోరుకున్న స్వప్నం సాకారమై ఆస్కారూ దక్కిందంటే ఇండియా తరఫున అఫీషియల్ నామినేషన్ గా పంపనందుకు ఇక్కడి ఫెడరేషన్ సభ్యులకు ఎన్ని నిద్రలేని రాత్రులు మిగులుతాయో.

Also Read – హమ్మయ్య! కొడాలి నాని కూడా ఫామ్‌లోకి వచ్చేశారుగా