ys jagan scamరాజకీయ విమర్శలలో అర్ధం లేకపోతే అవి చేకూర్చే ప్రయోజనం కన్నా, నష్టమే ఎక్కువని జగన్ రాజకీయ జీవితం చెప్పకనే చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ అంతటా అవినీతి జరిగిపోతుందంటూ ఢిల్లీ వెళ్లి మరీ గగ్గోలు పెడుతున్న జగన్ ప్రకటనలలో అసలు వాస్తవం లేదని, ఆయన చేస్తున్న ప్రకటనలే స్పష్టం చేస్తున్నాయి. ఏదొక బురద జల్లాలి కాబట్టి ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తున్నట్లుగా జగన్ ప్రకటనలు ఉంటున్నాయని రాజకీయ విశ్లేషకులు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తం చేయగా, అసలు జగన్ పలుకులు అర్ధ రహితమని నారా లోకేష్ కూడా జగన్ పై మండిపడ్డారు.

“జగన్ చేస్తున్న ఆరోపణలన్నీ ఎంత అవివేకమైనవో చెప్పడానికి ఒక ఉదాహరణ అని… 350 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 1400 కోట్ల అవినీతి ఏ మేరకు జరుగుతుందని, అసలు ఇలాంటి ఆరోపణలు చేయడానికి కాస్తైనా అర్ధం ఉండాలి కదా” అని జగన్ వ్యాఖ్యలను తూర్పారపట్టారు. దేశంలో ఎలాంటి అవినీతి వెలుగుచూసినా, అది ఆంధ్రప్రదేశ్ సర్కార్ కు ఆపాదించడం జగన్ కు పరిపాటిగా మారిందని, ఏడేళ్ళుగా ఆస్తుల వివరాలను ప్రకటిస్తూ వస్తున్నామని, జగన్ ఒక్క ఏడాది కూడా ఎందుకు తన ఆస్తుల చిట్టాను బయటపెట్టలేకపోయాడని… ఇప్పటికైనా ఆస్తులు ప్రకటించి, చర్చలకు సిద్ధమంటే… తాము ఎప్పుడూ ‘సై’ అని జగన్ పై మండిపడ్డారు.

లోకేష్ చేసిన విమర్శల మాటలు ఎలా ఉన్నా… 350 కోట్ల విలువైన ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్ట్ లో 1400 కోట్ల అవినీతి జరిగిందంటూ ఎలా జగన్ చెప్పారో బహుశా ఆయనకైనా తెలుసా అంటూ నెటిజన్లు కౌంటర్లు వేస్తున్నారు. ఇదంతా జగన్ ‘మాయ’ అని, తన పత్రిక ద్వారా తప్పుడు ప్రచారానికి తెరలేపడమే పనిగా పెట్టుకున్నారని వస్తున్న విశ్లేషణలకు కొదవలేదు. లాజిక్ లేని జగన్ విమర్శలకు… ‘దేవుడా…’ అనుకోవడం ప్రజల వంతవుతోంది.