no-fund-allocation-to-ap-rail-projects-mps-walk-outవిజయవాడలోని రైల్వే కల్యాణ మండపంలో దక్షిణ మధ్య రైల్వే జీఎం రవీంద్ర గుప్తా ఆంధ్రప్రదేశ్ ఎంపీలతో సమావేశం నిర్వహించారు. అయితే సమావేశం ప్రారంభమైన అర గంటకే అధికార పార్టీ ఆరుగురు ఎంపీలు బయటకు వచ్చేశారు. “నిధులు కేటాయించలేనప్పుడు.., కొత్త ప్రాజెక్టులు ఇవ్వలేనప్పుడు.., పెండింగ్ ప్రాజెక్టు పనులు పూర్తి చేయలేనప్పుడు… ఈ సమావేశాలు ఎందుకు?” అంటూ రైల్వే జీఎంపై అధికార పార్టీ ఎంపీలు విరుచుకుపడ్డారు.

నిధులు లేవని రైల్వే జీఎం చెప్పడంతో ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీలంతా సమావేశం నుండి వాకౌట్ చేసారు. బడ్జెట్‌లో 20 వేల కోట్లను ఇస్తున్నట్లుగా చూపి, కేవలం 2 వేల కోట్లను కూడా కేటాయించలేదంటూ, గత బడ్జెట్ లో 25 వేల కోట్లను మంజూరు చేసినట్లుగా చెప్తే, కేవలం 250 కోట్లు మాత్రమే ఇచ్చారని, చెప్పిన మొత్తం కూడా ఇవ్వలేనపుడు ఇలాంటి సమావేశాల్లో కూడా పాల్గొని ప్రయోజనం లేదని, రైల్వే బడ్జెట్‌కు ముందు ఆ శాఖ మంత్రిని కలిసి తమ గోడు వెలిబుచ్చుతామని అన్నారు.

ఏపీపై రైల్వే శాఖ చూపుతున్న వివక్ష వలన నిరసనలు తెలియజేయడంలో భాగంగా బయటకు వచ్చేసామని తెలిపిన ఎంపీలు తమకు కావాల్సిన ప్రాజెక్ట్ లపై వినతి పత్రాలను అందజేశామని తెలిపారు. కేంద్రం ఆధీనంలో ఉన్న రైల్వే శాఖపై తెలుగుదేశం ఎంపీలు పెంచిన “స్వరం” దేనికీ సంకేతాలు? అన్న రీతిలో చర్చలు జరుగుతున్నాయి.