TDP-YSRCP-TRSధర్మో రక్షతి రక్షితః అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మం నిన్ను కాపాడుతుంటుందని అర్దం అవుతోంది. అదేవిదంగా రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే ప్రజాస్వామ్యమే వాటిని రక్షిస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికారంలో ఉన్నప్పుడు రాజకీయ పార్టీలకి, వాటి నేతలకి ప్రజాస్వామ్యం అంత ముఖ్యంగా అనిపించదు. ఎందుకంటే అప్పుడు వారి చేతుల్లో తిరుగులేని అధికారాలు ఉంటాయి కనుక. ఆ అహంతోనే అధికారం శాస్వితం కాదనే విషయాన్ని కూడా మరిచిపోయి ఎప్పటికీ తామే అధికారంలో ఉంటామనే భ్రమతో ప్రజాస్వామ్యాన్ని, నైతిక విలువలని పక్కన పడేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుంటాయి.

అదే… అవి అధికారంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటే ప్రతిపక్షాల నుంచి రాజకీయంగా కాస్త ఇబ్బందులు ఎదురవవచ్చేమో కానీ పెను ప్రమాదం ఉండదు. ఎప్పుడైతే అధికార పార్టీ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉంటుందో అప్పుడు ప్రతిపక్షాలు కూడా తప్పనిసరిగా ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండక తప్పదు. లేకుంటే ప్రజలే ఈ తేడాని గుర్తించి ఎన్నికలప్పుడు తగినవిదంగా బుద్ధి చెపుతారు.

గతంలో తమిళనాడులో జయలలిత, కరుణానిధి ప్రతీకార రాజకీయాలతో ఒకరినొకరు ఎంత దారుణంగా అవమానించుకొన్నారో చూశాము. కానీ ఇప్పుడు తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న కరుణానిధి కుమారుడు స్టాలిన్ చాలా హుందాగా వ్యవహరిస్తూ మంచిపేరు సంపాదించుకొంటున్నారు. తమ పార్టీకి బద్ధశత్రువైన దివంగత ముఖ్యమంత్రి జయలలిత తీసుకొన్న అనేక నిర్ణయాలను గౌరవిస్తూ యాధాతధంగా కొనసాగిస్తూ అందరి ప్రశంశలు అందుకొంటున్నారు.

ప్రజాస్వామ్యానికి, నైతిక విలువలకి కట్టుబడితే ఏవిదంగా ఉంటుందో స్టాలిన్ చూపిస్తుండగా, కట్టుబడకపోతే ఎంత భయానక పరిస్థితులు ఎదుర్కోవలసి ఉంటుందో దివంగత జయలలిత, కరుణానిధిలు అనుభవించిన అవమానాలు నిదర్శనంగా ఉన్నాయి.

కానీ ఇప్పుడు రాజకీయాలలో ముఖ్యంగా అధికారంలో ఉన్న పార్టీలకు ఈ ప్రజాస్వామ్యానికి కట్టుబడి ఉండటం, నైతిక విలువలు పాటించడంపై ఏ మాత్రం ఆసక్తిలేదు. కనుక తమ రాజకీయ ప్రత్యర్ధిని ఏవిదంగానైనా చావుదెబ్బతీసేందుకు వెనకాడటం లేదు. అందుకోసం తమ చేతిలో ఉన్న అధికారాన్ని, పోలీస్ తదితర యంత్రాంగాన్ని కూడా నిస్సంకోచంగా వాడేసుకొంటున్నాయి.

ఏపీ, తెలంగాణలతో సహా దేశంలో చాలా రాష్ట్రాలలో ఇంచుమించు ఇవే పరిస్థితులున్నాయి. కనుక భవిష్యత్‌లో వీటి విపరీత పరిణామాలు కూడా కనిపిస్తాయి. ఇప్పుడు వేదిస్తున్నవారు రేపు బాధితులుగా మారవచ్చు. అందుకే ఒకవేళ ఎన్నికలలో ఓడిపోతే రాష్ట్రంలో ఉండగలరా?అనే ప్రశ్న ఇప్పుడు తరచూ వినబడుతోంది.

బహుశః అందుకేనేమో ఎట్టి పరిస్థితులలో కూడా వచ్చే ఎన్నికలలో కూడా మనమే గెలవాలని, మరో 30 ఏళ్ళపాటు మనమే అధికారంలో ఉండాలనే తాపత్రయం కూడా పెరిగిపోయింది. నిజానికి ఇది అధికారం కోసం తాపత్రయం కాదు. ఇప్పుడు మనం చేస్తున్నవాటికి రేపు మనకే గతి పడుతుందో అనే ఆందోళనే అని చెప్పవచ్చు.

కానీ అడుసు తొక్కనేల కాలు కడుగనేల?అన్నట్లు ఇప్పుడు ప్రజాసామ్యాన్ని , నైతిక విలువలని పట్టించుకోకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం ఎందుకు?ఆనక దానికి మూల్యం చెల్లించుకోవలసి వస్తుందని బాధపడటం ఎందుకు?