no chance to ys jaganఅధికార ప్రభుత్వం ఎన్ని సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టినా, ఎంత సుపరిపాలన అందించినా అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరచలేదు. అలాంటిది ప్రస్తుతం ఏపీలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం ఆశించిన మేరకు సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టలేదు, అలాగని విస్తృత స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేదు. ప్రస్తుతం అన్నీ ప్రణాళిక దశలో ఉన్నాయి. మరో రెండేళ్ళు గడిస్తేనే గానీ, ఈ ప్రభుత్వం అసలు రూపం బయట పడే అవకాశం లేదు. అయితే విభజన కారణంగా రాష్త్రం ఉన్న ప్రత్యేక పరిస్తితులను గమనించిన ప్రజలు కూడా చంద్రబాబుకు బాసటగా నిలుస్తున్నారు. అయితే ఎంతో కొంత ప్రజా వ్యతిరేకత ఉండక మానదు. ఈ అంశాలనే ప్రతిపక్షం తనకు అనుకూలంగా మార్చుకోవాలని ప్రయత్నిస్తుంటుంది.

కానీ, చంద్రబాబు సర్కార్ మాత్రం ఆ క్రెడిట్ కూడా ప్రతిపక్షానికి ఇచ్చే ఉద్దేశం కనపడుతున్నట్లు లేదు. అందుకనే జేసీ దివాకర్ రెడ్డి వంటి ‘స్పెషల్’ రాజకీయ నేతల నోట సొంత పార్టీ పైనే విమర్శలు గుప్పిస్తోంది. ఆదివారం నాడు ఓ వివాహ వేడుకకు హాజరైన జేసీ, “రాష్ట్రంలో నెలకొన్న పరిణామాలతో ప్రజలు సంతృప్తి కరంగా లేరని, పాలనలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ముఖ్యమంత్రి చంద్రబాబు విజయవాడలో, అధికార యంత్రాంగం హైదరాబాద్ లో ఉండడం వల్లనే పాలనా గాడిలో పడలేదని, ఒక్క రాష్ట్ర ప్రభుత్వ విషయంలోనే కాదు, కేంద్రంలో అధికారంలో ఉన్న మోడీ సర్కార్ పై కూడా ప్రజలు ఆగ్రహంగా ఉన్నారని” మండిపడ్డారు.

సాధారణంగా ఇలాంటి వ్యాఖ్యలు ప్రతిపక్షాల నుండి వస్తుంటాయి. అయితే ఏపీలో ఉన్న ప్రతిపక్షం స్వార్ధ రాజకీయాలకే పరిమితం కావడంతో, ప్రతిపక్ష బాధ్యతలను కూడా అధికార పక్షమే నిర్వహిస్తోందన్న చలోక్తులు సోషల్ మీడియా వేదికగా వ్యక్తమవుతున్నాయి. ప్రజా వ్యతిరేక భావాలను కూడా అధికార పక్షమే వినిపించడం కొత్తగా ఉంది కదూ! ఇందులో దివాకర్ రెడ్డిది అందెవేసిన చేయి కాబట్టే, అయన ‘స్వరం’ ఎప్పుడు సంచలన భావాలను ప్రకటిస్తుంది. మరి ఇదంతా చూస్తూ ప్రతిపక్ష నేత జగన్ ఏం చేయాలి అనుకుంటున్నారా..! ఎలాగూ ఉందిగా జగన్ బ్రాండ్ “ఓదార్పు…”