KTR - Harish Raoఈ మధ్య కాలంలో తరచుగా వార్తలు రావడం, తప్పు కావడం ఏదైనా ఉంటే అది తెలంగాణాలో మంత్రివర్గ విస్తరణ గురించే. ఇప్పటికే వార్తలలో ఎన్నో తేదీలు వినిపించి తప్పు అని తేలిపోయాయి. తాజాగా వినిపిస్తున్న మరో తారీఖు ఈ నెల 10. ఆదివారం సాయంత్రం నాలుగు గంటలకు మంచి ముహూర్తం ఉందని సమాచారం. ముందుగా చెప్పినట్టుగానే పరిమిత స్థాయిలోనే మంత్రివర్గం ఉండవచ్చని తెలుస్తుంది. దీనితో ఆశావహులు మరోసారి తమ ప్రయత్నాలు తాము మొదలు పెట్టారు.

ఈటెల రాజేందర్,తలసాని శ్రీనివాస యాదవ్, జగదీష్ రెడ్డి,నిరంజన్ రెడ్డి, ప్రశాంతరెడ్డి, ఎర్రబెల్లి దయాకరరావు లకు పదవులు దక్కవచ్చని చెబుతున్నారు. ఇదే సమయంలో కేటీఆర్, హరీష్ రావులకు మంత్రి పదవులు ఉండవని మరోసారి వార్తలు వస్తున్నాయి. గత కేబినెట్ లో వీరిద్దరూ కీలక శాఖలు నిర్వహించిన సంగతి తెలిసిందే. వీరిని పూర్తి స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల కోసం వినియోగించుకుని మొత్తం అన్ని స్థానాలను గెలవడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారని తెరాస వర్గాలు అంటున్నాయి.

పార్లమెంటు ఎన్నికల తర్వాతే వీరికి మంత్రి పదవులు ఇవ్వవచ్చని అంటున్నారు. అయితే హరీష్ వర్గం మాత్రం హరీష్ ను ప్రభుత్వం నుండి తెలివిగా తప్పించడానికి ఇద్దరినీ పక్కన పెడుతున్నారని, ఇద్దరినీ పక్కన పెడితే విమర్శలకు ఆస్కారం ఉండదని కేసీఆర్ ఇలా చేస్తున్నారని భావిస్తున్నారు. అదే సమయంలో మంత్రి పదవి లేకపోయినా కేటీఆర్ తెర వెనుక నుండి అన్ని అధికారాలు అనుభవిస్తారని వారి ఆరోపణ. అయితే వార్తలలోని వ్యక్తి హరీష్ రావు మాత్రం ప్రస్తుతానికి గుంభనం గానే ఉన్నారు.