Kabzaa_Movieఏదైనా ఒక జానర్ లో బ్లాక్ బస్టర్ పడితే దాన్నే ఫాలో అవుతూ గంపగుత్తగా అదే బ్యాక్ డ్రాప్ లో సినిమాలు తీసుకుంటూ పోవడం, ఎక్కడో ఒక చోట వరసగా డిజాస్టర్లు పడి వాటికి బ్రేక్ పడటం సహజం. సమరసింహారెడ్డి తర్వాత ఫ్యాక్షన్ బట్టలు వేసుకుని నటించని హీరో లేడు. తేజ చిత్రం వచ్చాక కొంత కాలం టాలీవుడ్ మొత్తం టీనేజ్ లవ్ జ్వరంతో ఊగిపోయింది. ఎర్రసైన్యం సక్సెస్ చూసి దాసరి, కృష్ణ, మోహన్ బాబు లాంటి వాళ్ళు సైతం అలాంటివి తీయకుండా ఉండలేకపోయారు. అర్జున్ రెడ్డి హ్యాంగోవర్ తో త్వరలో సిద్దార్థ్ రాయ్ అనే మూవీ రాబోతోంది. గెటప్ గట్రా పోలికలు చాలానే ఉన్నాయి.

కెజిఎఫ్ వచ్చాక శాండల్ వుడ్ కూడా ఇలాంటి మేనియాలో ఊగిపోతోంది. అక్కడి దర్శక నిర్మాతలు అదే తరహా విజువల్స్, బ్యాక్ గ్రౌండ్, గ్యాంగ్ స్టర్ డ్రామా కథలను కావాలని రాసుకుని వాటిని తెరకెక్కించి ప్యాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేస్తున్నారు. కబ్జ అనే మల్టీస్టారర్ ఒకటి ఇంకో మూడు రోజులో రాబోతోంది. మనకూ బాగా పరిచయమున్న ఉపేంద్ర హీరో. ఈగ విలన్ కిచ్చ సుదీప్ ఒక కీలక పాత్ర చేశాడు. ఈ ఇద్దరికీ మంచి ఫ్రెండ్ షిప్ ఉంది. పవన్ వెంకటేష్ ల గోపాల గోపాలను ఈ కాంబోతోనే కన్నడలో రీమేక్ చేశారు. ఇక్కడ ఫలితమే అక్కడా వచ్చింది లెండి. కబ్జలో అదనంగా టాప్ సీనియర్ హీరో శివరాజ్ కుమార్ కూడా ఉన్నాడు.

కథా నేపథ్యం 1945 తీసుకుని దానికి తగ్గట్టు భారీ సెట్లు, ఆర్ట్ వర్క్, గ్రాఫిక్స్ తో కోట్ల రూపాయలు మంచి నీళ్లలా ఖర్చు పెట్టారు. దర్శకుడు చంద్రు సీనియరే అయినప్పటికీ ఇంత గ్రాండియర్ హ్యాండిల్ చేయడం ఆయనకిదే మొదటిసారి. సంగీతం రవి బస్రూర్ కే ఇచ్చారు. బడ్జెట్ వంద కోట్లు దాటేసిందని అక్కడి పత్రికల కథనాలు. మన శ్రేయ, మురళీశర్మ లాంటి తెలుసున్న క్యాస్టింగ్ చాలానే ఉంది. అన్నీ బాగానే కనిపిస్తున్నా సినిమాకు బజ్ మాత్రం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ లో దూకుడు లేదు. ఎప్పుడెప్పుడు చూద్దామా అనే ఉత్సుకత ఫ్యాన్స్ లోనే కనిపించకపోతే ఎలా

జనాలు తెలివి మీరిపోయారు. ఇదేదో కెజిఎఫ్ ని కాపీ కొట్టినట్టుందనే అభిప్రాయం ట్రైలర్ తోనే వచ్చేయడంతో టాక్ విన్నాక చూద్దాంలే అని డిసైడ్ అయ్యారు. మాములుగా అయితే ఇలాంటి క్రేజీ కాంబోకి మొదటి రోజు టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోవాలి. కానీ కర్ణాటక మెయిన్ సెంటర్స్ ఆన్ లైన్ చూస్తే ఈజీగా దొరికే పరిస్థితి నెలకొంది. కెజిఎఫ్ వచ్చిన ఇంత తక్కువ గ్యాప్ లోనే అలాంటి నేపథ్యం తీసుకోవడమే శాపంగా మారిందా అంటే ఔననే అనిపిస్తోంది. నల్లని స్క్రీన్ కలర్ లో ఎన్ని కోట్లు ఖర్చు పెడితేనేం ఆడియన్స్ కి ఏదో కొత్తగా ఉందనే ఫీలింగ్ కలగకపోతే ఇంతే. అందుకే పెద్దగా పట్టించుకోవడం లేదేమో