KCR Jagan
రెండు తెలుగు రాష్ట్రాలకు విభజన సమయంలో ఇచ్చిన హామీలు అన్నిటినీ కేంద్ర ప్రభుత్వం తుంగలో తొక్కింది. హామీలు సంగతి తరువాత కనీసం రెండు రాష్ట్రాల మధ్య ఉన్న అనేక సమస్యల పై కూడా తాము ఏమీ చెయ్యలేం అని కేంద్రం పార్లమెంట్ సాక్షిగా చేతులెత్తేసింది. లోక్‌సభలో ఎంపీ రామ్మోహన్‌నాయుడు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిత్యానంద్‌రాయ్ ఈ విధంగా స్పందించారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం కుదరదని కేంద్రం మరోసారి స్పష్టం చేసింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామని తెలిపారు. గతంలోనే 14వ ఆర్ధిక సంఘం సభ్యులు ప్రత్యేక హోదా విషయం లో తాము ఎటువంటి సిఫార్సు చెయ్యలేదని పలుమార్లు చెప్పినా కేంద్రం అదే మాట పార్లిమెంట్ సాక్షిగా పదే పదే చెప్పడం దారుణం.

హోదా గురించి పక్కన పెడితే… కేంద్రం తాను పోషించాల్సిన పెద్దన్న పాత్ర నుండి కూడా తప్పించుకునే ప్రయత్నం చెయ్యడం గమనార్హం. తెలుగు రాష్ట్రాల మధ్య అనేక సమస్యలున్నాయని..పరిష్కారం తమ చేతుల్లో లేదని చెప్పారు. తెలుగు రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని నిత్యానంద్‌రాయ్ సూచించారు. రెండు తెలుగు రాష్ట్రాల లోని తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ బాధ్యత నుండి తప్పించుకోవడం దారుణం.

తెలంగాణ లో బీజేపీ బలపడుతుంది. వచ్చే ఎన్నికలలో అధికారంలోకి రావాలని ఆరటపడుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ స్థానాన్ని ఆక్రమించాలని కూడా ఆసక్తిగా ఉంది. ఈ తరుణంలో ఏదో ఒక పక్క తీసుకోవాలని బిజెపి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుకోవడం లేదు. అయితే ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం తన కనీస బాధ్యత నుండి తప్పుకోవడం దారుణం అనే అనుకోవాలి.