Nitish Rana Rohit Sharma take Mumbai Indians to topఒకప్పుడు ఏ అంశంతో అయితే ముంబై ఇండియన్స్ జట్టు బాగా ఇబ్బందులు పడిందో, ప్రస్తుతం అదే అంశంలో బాగా స్ట్రాంగ్ గా మారి ప్రత్యర్ధి టీంలకు వరుస షాక్ లు ఇస్తున్నారు. బ్యాటింగ్ విభాగంలో ఎక్కువ శాతం విదేశీ హిట్టర్ల పైనే ఆధారపడిన ముంబై ఇండియన్స్ కు, వారు విఫలమైనపుడల్లా ఓటమి చవిచూడాల్సి వచ్చేది. అయితే ఈ ఐపీఎల్ సీజన్ 10లో మాత్రం, పూర్తిగా స్వదేశీ ఆటగాళ్ళ బ్యాటింగ్ ను అభివృద్ధి చేయడంతో, ఇండియన్ క్రీడాకారులు విశేషంగా రాణిస్తూ ముంబై ఇండియన్స్ కు వరుస విజయాలు అందిస్తున్నారు.

తాజాగా గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లోనూ ఇదే సీన్ రిపీట్ అయ్యింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబై జట్టు గుజరాత్ ను 176 పరుగులకు నియత్రించింది. దీంతో మ్యాచ్ ఆసక్తికరంగా మారిన తరుణంలో ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని కూడా చేధించి, వరుసగా నాలుగవ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఓవర్లోనే ఓపెనర్ పార్థీవ్ పటేల్ వికెట్ కోల్పోయిన తర్వాత క్రీజులోకి వచ్చిన యువ బ్యాట్స్ మెన్ రానా మరోసారి సత్తా చాటి ముంబై స్కోర్ బోర్డును పరుగులు పెట్టించాడు.

కేవలం 36 బంతుల్లోనే 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసిన రానా, 10వ ఓవర్లో జట్టు స్కోర్ 85 పరుగుల వద్ద ఉన్నపుడు వెనుదిరిగాడు. అయితే ఆ తర్వాత బాధ్యతను కెప్టెన్ రోహిత్ శర్మ అందిపుచ్చుకుని, జట్టును విజయతీరాలకు చేర్చాడు. అలాగే మరో ఎండ్ లో పొల్లార్డ్ కూడా భారీ షాట్లతో విరుచుకుపడడంతో, ముంబై లక్ష్య చేధనలో ఎలాంటి ట్విస్ట్ లు నమోదు కాలేదు. చివర్లో పొల్లార్డ్ ఔటైనప్పటికీ, హార్దిక్ పాండ్య సహకారంతో మ్యాచ్ ను విజయవంతంగా ముగించాడు రోహిత్ శర్మ.