nitin gadkari video viralకేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తీవ్రంగా హల్చల్ చేస్తోంది. “కొంతమంది సమస్యల నుంచి అవకాశాలు సృష్టిస్తారు… కొంతమంది అవకాశాలను సమస్యలుగా మారుస్తారు…” అంటూ చిరుదరహాసం ప్రదర్శిస్తూ నితిన్ గడ్కరీ చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు నీరాజనం పలుకుతున్నారు.

ఈ వ్యాఖ్యలు చేసిన సందర్భంలో పక్కకు తిరిగి జగన్ ను చూసిన వైనం కూడా వీక్షకులను మరింతగా అలరిస్తోంది. ఈ వీడియోను పెడుతూ నెటిజన్లు చేస్తోన్న పోస్ట్ లు సోషల్ మీడియాలో వినోదభరితంగా మారాయి. ‘గడ్కరీ గారికి తెలియదా… ఎవరిని ఎలా వాయించాలో..’ అంటూ పరోక్షమైన కామెంట్స్ పెడుతుండగా, జగన్ చేత కానితనం గురించి ముఖం మీదే కేంద్రమంత్రి చెప్పేసారంటూ మరికొందరు నేరుగానే కామెంట్స్ చేస్తున్నారు.

అయితే గడ్కరీ చేసిన ఓ వ్యాఖ్య మాత్రం గతంలో చంద్రబాబు తెలిపారు. 2014 రాష్ట్ర విభజన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత… రాజధాని లేనటువంటి ఆదాయం కొరత ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? అని మీడియా ప్రశ్నించిన ప్రశ్నకు, సరిగ్గా నేడు గడ్కరీ చెప్పిన విషయాన్నే 2014లో చంద్రబాబు ప్రస్తావించారు.

ఏదైనా సమస్య వచ్చినపుడు దానిని చూసి భయపడిపోకుండా, దాని నుండి అవకాశాలు సృష్టించుకుంటే అవి మనకు మెట్లుగా ఉపయోగపడతాయి. మొదటిసారి ముఖ్యమంత్రి అయినపుడు హైదరాబాద్ ను ఆ విధంగా చేయడానికి నేను ఎంచుకున్న మార్గం ఇదే, నేడు ఏపీ విభజన తర్వాత అనేక సమస్యలున్నాయి, వాటి నుండి అవకాశాలు సృష్టిస్తాను అంటూ చాలా విశ్వాసంగా వెల్లడించారు.

అనుభవం నేర్పిన పాఠమో గానీ, చెప్పిన మాట ప్రకారం విభజన సమస్యలను దాటుకుని రాష్ట్రంలో అనేక అవకాశాలను చంద్రబాబు సృష్టించారు. ఆ అవకాశాల రెవిన్యూనే ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ‘సంక్షేమం’ పేరుతో పంపకాలు చేస్తోందని టీడీపీ వర్గాలు విమర్శిస్తున్నాయి. అయితే అప్పట్లో ప్రజలకు అవకాశాల విలువ అవగతం కాలేదు గానీ, ప్రస్తుతం మాత్రం పూర్తిగా తెలిసి వచ్చినట్లుంది.

2014లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలకు, నేడు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ చేసిన ‘కొంతమంది సమస్యల నుంచి అవకాశాలు సృష్టిస్తారు’ వ్యాఖ్యలకు పోలిక అయితే చంద్రబాబు రూపంలో కనపడుతోంది. మరి ఆ రెండో వ్యాఖ్య ‘కొంతమంది అవకాశాలను సమస్యలుగా మారుస్తారు’ ఎవరిని ఉద్దేశించి అన్నారో ప్రత్యేకంగా చెప్పాలా?