nitin gadkari special package to telanganaహైదరాబాద్‌ – వరంగల్‌ జాతీయ రహదారి అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు తెలంగాణకు రానున్న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ 25 వేల కోట్ల ప్యాకేజీని ప్రకటించబోతున్నారు. తెలంగాణాలో 1800 కిలోమీటర్ల మేరకు జాతీయ రహదారుల అభివృద్ధి నిమిత్తం ఈ భారీ ప్యాకేజీని నితిన్ గడ్కరీ ప్రకటించబోతున్నారని కేంద్ర కార్మికశాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. అలాగే తెలంగాణాకు అందుబాటులో లేనటువంటి సముద్ర మార్గాన్ని అనుసంధానం చేసేందుకు తెలంగాణా, ఏపీ, మహారాష్ట్ర, చత్తీస్ ఘడ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నితిన్ గడ్కరీ చర్చలు జరపనున్నారు.

దేశంలో మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నా గానీ, తెలంగాణకు కేంద్రం విశేషంగా నిధులు మంజూరు చేస్తోందని, హైదరాబాద్‌ను వైఫై సిటీగా చేసేందుకు సిద్ధంగా ఉందని, హైదరాబాద్ ను విశ్వనగరంగా అభివృద్ధి చెందాలంటే కేంద్ర ప్రభుత్వ సాయం అవసరముందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం మెట్రో రైల్‌ ప్రారంభోత్సవం తేదీని ప్రకటిస్తే ప్రారంభించేందుకు ప్రధాని నరేంద్ర మోడీని తీసుకువస్తామని, అయితే పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయని, అలాగే రాష్ట్రంలో 5 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్తు ప్రాజెక్టులకు ప్రతిపాదనలు పంపాలని కేంద్రం ఇప్పటికే రాష్ట్రాన్ని అడిగిందని, కానీ రాష్ట్ర ప్రభుత్వం నుండి సమాధానం కొరవడిందని దత్తాత్రేయ వ్యాఖ్యానించారు.

రాబోతున్న జీహెచ్ఎంసీ ఎన్నికల నేపధ్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హైదరాబాద్ కేంద్రంగా పలు అభివృద్ధి పధకాలపై దృష్టి మరల్చిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. తెలంగాణాలో ఎలాగైనా పట్టు సాధించేందుకు బిజెపి చేస్తున్న ప్రయత్నంలో భాగంగానే ఈ భారీ ప్యాకేజీ ప్రకటన అని విశ్లేషిస్తున్నారు.