India Motor Vehicle Act, India Motor Vehicle Act Amendment, India Motor Vehicle Act Amendment Bill, Nitin Gadkari India Motor Vehicle Act Amendmentమోటారు వాహనాల చట్టానికి సంబంధించిన సవరణ బిల్లును కేంద్ర ప్రభుత్వం మంగళవారం లోక్‌సభ ముందు ఉంచింది. ఇక నుంచి నాలుగేళ్లు నిండిన పిల్లలు కూడా విధిగా హెల్మెట్ ధరించాల్సి ఉంటుందంటూ బిల్లులో సరికొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఇది అతిక్రమించిన వారి నుంచి వెయ్యి జరిమానాగా వసూలు చేయనున్నట్టు పేర్కొంది. అయితే తలపాగా ధరించే సిక్కు పిల్లలకు మాత్రం ఈ నిబంధన వర్తించదని వివరించింది. చాలా మంది ద్విచక్ర వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకుందుకే హెల్మెట్ ధరిస్తున్నారు తప్ప రక్షణ గురించి కాదని ప్రభుత్వం ఆవేదన వ్యక్తం చేసింది.

కార్లలో ప్రయాణించే 14 ఏళ్ల లోపు పిల్లలు రక్షణ కోసం తప్పకుండా సీటు బెల్టు ధరించాల్సిందేనని ప్రతిపాదించింది. రోడ్డు భద్రతే ధ్యేయంగా సవరణ బిల్లును ప్రభుత్వం తీసుకొచ్చింది. ట్రాఫిక్ ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించడం ద్వారా రోడ్ సేఫ్టీని పెంచాలని నిర్ణయించింది. అలాగే కమర్షియల్ డైవర్లకు లైసెన్స్ జారీ చేసే విషయంలో కనీస అర్హత నిబంధన విధించనుంది. బిల్లును త్వరతగతిన చట్టంగా మార్చడం ద్వారా ప్రజల ప్రాణాలను కాపాడవచ్చని, రోడ్డు ప్రమాదాల ద్వారా రోజుకు 400 మంది ప్రాణాలు కోల్పోతున్నారని రవాణా శాఖా మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు.

సవరణ బిల్లు ప్రకారం తాగి వాహనం నడిపే వారికి 15 వేలు, ప్రమాదకరంగా డ్రైవ్ చేస్తూ పట్టుబడిన వారికి 10వేల జరిమానా, ఏడాది జైలు లేదంటే రెండూ విధించనున్నారు. ఇన్స్యూరెన్స్ లేకుండా రెండోసారి పట్టుబడిన వారికి 4 వేలు ఫైన్ వేయనున్నారు. అలాగే డ్రైవింగ్ చేస్తూ పిల్లలు పట్టుబడితే ఆ వాహన రిజిస్ట్రేషన్‌ను రెండేళ్ల పాటు రద్దు చేస్తారు. అంతేకాదు అటువంటి వారికి 25 ఏళ్ల లోపు లైసెన్స్ మంజూరు చేయరు. వాహన యజమానికి కూడా జరిమానా, జైలు శిక్ష విధిస్తారు.