Nithin Reddy-hurt with-Negative-Talk!ఈ వారం విడుదలైన మూడు సినిమాలలో ‘లై’ అన్నింటి కంటే వెనుక వరుసలో ఉన్న మాట తెలిసిందే. తొలి రోజు నుండి వెలువడిన డివైడ్ టాక్ నేపధ్యంలో… తను నిద్రలేని రాత్రులను గడిపానని హీరో నితిన్ తాజాగా వెలిబుచ్చారు. ఆదివారం నాడు ఏర్పాటు చేసిన ‘థాంక్స్ మీట్’లో ప్రసంగించిన నితిన్, ‘లై’ సినిమా ఫలితం పట్ల చాలా హర్ట్ అయినట్లుగా కనపడడం విశేషం. బహుశా ఈ సినిమాపై భారీ అంచనాలు పెట్టుకున్నాడేమో గానీ, డివైడ్ టాక్ వచ్చిన వైనాన్ని నితిన్ అంగీకరించారు.

ఫస్ట్ టాక్ యుఎస్ నుండి బాగానే ఉందని వచ్చిందని, అయితే ఇక్కడ మాత్రం ఎక్కువ శాతం మంది నిరుత్సాహపడ్డారని, అయితే ఈ టాక్ రెండవ రోజు నుండి తగ్గుముఖం పడుతూ వచ్చిందని… ఎక్కువ మంది సంతృప్తి చెందుతూ, తక్కువ మంది అసంతృప్తి పాలవుతున్నారని, రానున్న రోజుల్లో అది పూర్తిగా పోతుందో లేదో చూడాలని, ఈ సినిమా హిట్టయినా, కాకున్నా ఒక్కటి మాత్రం తాను చెప్పింది జరిగిందని… దర్శకుడు హను రాఘవపూడి, హీరోయిన్ తదితరులకు మంచి పేరు వస్తుందని చెప్పానని, అలాగే వారికి మంచి పేరు రావడం సంతోషం కలిగించిందని అన్నారు.

‘అ…ఆ…’ వంటి భారీ విజయం తర్వాత ఏ కమర్షియల్ సినిమా తీసినా సేఫ్ సైడ్ లో ఉండవచ్చు గానీ, తాను రఫ్ రోడ్డును ఎంపిక చేసుకున్నానని, అందువలన ప్రేక్షకులు అంగీకరించడానికి కొంత సమయం పడుతుందేమోనని అన్న నితిన్ వ్యాఖ్యల్లో అసలు ఉత్సాహమే లేదు. మిగిలిన రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద స్ట్రాంగ్ గా నిలబడడంతో, కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా తెరకెక్కిన “లై” సినిమా ప్రేక్షకుల ఆదరణను పొందలేకపోతోంది అన్న మాట వాస్తవమే. ఆ ఫలితం నితిన్ ముఖకవళికల్లో స్పష్టంగా కనపడుతోంది.