Union_Budget_2023_Nirmala_Sitharamanకేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌ అంటే దేశంలో అన్ని వర్గాల ప్రజలు దానిలో తమకేమి వరం లభిస్తుందా… అని ఆశగా ఎదురుచూస్తుంటారు. కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ ఈరోజు పార్లమెంటులో బడ్జెట్‌ ప్రకటించేశారు. కొన్ని రోజుల క్రితం ఆమె మీడియాతో మాట్లాడుతూ, “నేనూ మద్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన దానినే. కనుక నాకు వారి అవసరాలు, కష్టాలు, సమస్యలు అన్నీ బాగా తెలుసు,” అని అన్నారు. ఆమె మాటలు విని మద్యతరగతి ప్రజలకి ఆమె చాలా వరాలు ప్రకటిస్తారని ఆశగా ఎదురుచూశారు.

మద్యతరగతి ప్రజల కోసం ఆమె ఆదాయపన్ను రాయితీని రూ.7 లక్షలకి పెంచారు. కానీ వార్షికాదాయం రూ.3 లక్షల వరకు మాత్రమే పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ఆపైన పన్ను చెల్లించక తప్పదు.

రూ.3 లక్షల నుంచి రూ. 6 లక్షల వరకు 5%, రూ.6 లక్షల నుంచి 9 లక్షల వరకు 10%, రూ.9 లక్షలు నుంచి రూ.12 లక్షల వరకు 15%, రూ.12 లక్షల నుంచి 15 లక్షల వరకు 20%, రూ.15 లక్షలు పైబడి వార్షిక ఆదాయం కలిగినవారికి 30% పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

ఇప్పుడు చాలా మంది ఐ‌టి ఉద్యోగులకి కనీస వార్షికాదాయం రూ.5-6 లక్షలకి తక్కువ ఉండదు. కనుక పన్నుపోటు తప్పదన్న మాట! మహిళల కోసం కొత్తగా రెండేళ్ళ కాలానికి 7.5 శాతం వడ్డీతో మహిళా సమ్మాన్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఫిక్స్ డిపాజిట్) ప్రకటించారు. అయితే దీనిలో గరిష్టంగా రూ.2 లక్షలు మాత్రమే డిపాజిట్ చేయవచ్చు. సీనియర్ సిటిజన్స్ పొదుపు పధకం పరిమితి రూ.15 లక్షల నుంచి రూ.30 లక్షలకి పెంచారు.

ఇక సామాన్య, మద్యతరగతి ప్రజలకి ఎంతో అవసరమైన బంగారం, వెండి ధరలు పెరుగనున్నాయి. మొబైల్ ఫోన్స్, టీవీలు, ల్యాప్ టాప్స్, ఆటవస్తువుల ధరలు తగ్గుతాయి. అయితే ఈ తగ్గుదల మార్కెట్‌ మాయాజాలంలో కనబడకుండా పోతుందని అందరికీ తెలుసు. ఇప్పుడు బంగారు, వెండి ఆభరణాల ధరలు తగ్గడం లేదు కానీ తగ్గినా, పెరిగినా వాటి అసలు ధరకి తరుగు, మజూరీ, జీఎస్టీ పేరుతో జరుగుతున్న దోపిడీ గురించి అందరికీ తెలుసు. కనుక బడ్జెట్‌లో ఈ అంకెల గారడీని పట్టించుకోనవసరం లేదు.

కానీ దేశాభివృద్ధి కోసం బడ్జెట్‌లో ఏమేమి చేయబోతోందనేదే చాలా ముఖ్యం. వాటి గురించి క్లుప్తంగా చెప్పుకోవాలంటే…

· రైల్వే ఆభివృద్ధి కోసం రూ.2.40 లక్షల కోట్లు

· దేశవ్యాప్తంగా 50 విమానాశ్రయాలు, హెలీప్యాడ్స్ నిర్మాణం.

· దేశవ్యాప్తంగా 50 పర్యాటక ఆకర్షణ కేంద్రాలని అభివృద్ధి.

· దేశవ్యాప్తంగా వంద మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులకి రూ.75,000 కోట్లు.

· పట్టణాలలో మౌలిక వసతుల కల్పనకి రూ.10,000 కోట్లు.

· మూలధన వ్యయానికి రూ.13.5 లక్షల కోట్లు.

· దేశవ్యాప్తంగా వైద్య కళాశాలలు, 157 నర్సింగ్ కళాశాలకి అనుమతి.

· కోస్టల్ షిప్పింగ్‌కు ప్రోత్సాహకాలు

· పంచాయతీ స్థాయిలో గిడ్డంగుల నిర్మాణాలకు ఏర్పాట్లు.

· నేషనల్ హైడ్రోజన్ కార్యక్రమానికి రూ.19,700 కోట్లు

· సముద్రతీరాల వెంబడి మద అడవుల పెంపకం.

· ఆర్టిఫిషియల్ ఇంటలిజన్స్ రంగం అభివృద్ధికి నిధులు.

· స్టార్టప్‌లకి మరిన్ని ప్రోత్సాహకాలు

· పీఎం ఆవాస్ యోజన పధకం కోసం రూ.79,000 కోట్లు

· మారుమూల ప్రాంతాలలో నివసించే ఆదివాసీల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఏకలవ్య పాఠశాలల కోసం రూ.15, 000 కోట్లు.

· ఏకలవ్య పాఠశాలలో భారీగా ఉపాధ్యాయుల నియామకం.