Nirmala sitharaman Budget 2020  effects andhra pradesh and Telanganaనిన్న పార్లమెంట్ లో ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ రెండు తెలుగు రాష్ట్రాలను తీవ్ర నిరాశకు గురి చేసింది. ప్రత్యేకమైన కేటాయింపులు ఏమీ లేకపోగా, కేంద్రపన్నులలో వాటాను గణనీయంగా తగ్గించింది. కేంద్ర పన్నుల్లో వాటా పంపిణీకి 2011 జనాభా లెక్కలను ప్రాతిపదికగా తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని తొలి నుంచి అనుమానించినట్లుగానే కోత పడింది.

15వ ఆర్థిక సంఘం తీసుకున్న విభిన్న కొలమానాల కారణంగా మొత్తం 8 రాష్ట్రాల వెయిటేజీ తగ్గిపోగా, 20 రాష్ట్రాలకు పెరిగింది. వెయిటేజీ తగ్గిపోయిన ఏడింటిలో నాలుగు దక్షిణాది రాష్ట్రాలే. కొత్త కొలమానాల వల్ల 8 రాష్ట్రాలు వచ్చే ఆర్థిక సంవత్సరంలో 18,389 కోట్లు నష్టపోతుండగా, అందులో నాలుగు దక్షిణాది రాష్ట్రాల వాటానే రూ.16,640.29 కోట్లు.

ఇందులో రెండు తెలుగు రాష్ట్రాలకు వచ్చే నష్టం అక్షరాలా రూ.3905.2 కోట్లు. ఇందులో తెలంగాణ (రూ.2,383.90 కోట్లు), ఆంధ్రప్రదేశ్ (రూ. 1,521.30 కోట్లు) కోల్పోనున్నాయి. ఆర్ధిక మాంద్యం తీవ్రంగా ఉండడంతో ఈ కోత వల్ల రాష్ట్రాలకు చాలా ఇబ్బంది. అందులోనూ రెండు తెలుగు రాష్ట్రాలలో సంక్షేమ పథకాలు భారీ ఎత్తున అమలు అవుతున్నాయి.

ఈ తరుణంలో రెండు తెలుగు ప్రభుత్వాలకు ఇబ్బందే. మరీ ముఖ్యంగా ఇప్పటికే ఆర్ధిక సమస్యలతో సతమతం అవుతున్న ఆంధ్రప్రదేశ్ కు ఇది మరింత ఇబ్బంది. ఇక్కడ ఇంకో బాధాకరమైన విషయం ఏమిటంటే… కుటుంబ నియంత్రణ పాటించడంతో దక్షిణాది రాష్ట్రాల్లో జనాభా స్థిరీకరణ జరిగింది. ఈ కారణంగా అవి ఎక్కువగా నష్టపోవాల్సి వచ్చింది.