Nirmala Sitaraman comments on AP Government ఆంధ్రప్రదేశ్‌ దయనీయ పరిస్థితి గురించి ఇప్పటి వరకు తెలంగాణ మంత్రులు, నేతలే కామెంట్స్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా పార్లమెంట్ సాక్షిగా బయటపెట్టేయడంతో ఏపీ పరువు గంగలో కలిసిపోయింది. ఇప్పటికే రాజధాని లేని రాష్ట్రంగా ఏపీని అందరూ అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులకు నెలనెలా జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి ఏపీ ప్రభుత్వం చేరుకొందని, జీతాల కోసం ఉద్యోగులు ప్రతీ నెల రోడ్లపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారని నిర్మలా సీతారామన్ నేడు రాజ్యసభలో చెప్పేశారు.

అంతేకాదు… అందుకు కారణం కూడా ఆమే చెప్పారు. ఏపీ ప్రభుత్వం ఉద్యోగులకు జీతాలు ఈయలేని దుస్థితిలో ఉన్నప్పటికీ వందల కోట్లు ఖర్చుపెట్టి సంక్షేమ పధకాల గురించి దేశవ్యాప్తంగా ప్రకటనలు ఇచ్చుకొంటోందని అన్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయం వంటివాటికి ప్రభుత్వం రాయితీలు ఇవ్వడాన్ని ఎవరూ తప్పు పట్టలేరు కానీ దేనికైనా ఓ పరిమితి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి తగినంత ఆదాయం ఉన్నట్లయితే సంక్షేమ పధకాల కోసం బడ్జెట్‌లో కేటాయించుకోవచ్చు. కానీ తలకి మించి భారం ఎత్తుకోవడం వలననే ఈ దుస్థితి ఎదురవుతోంది,” అని అన్నారు.

నిర్మలా సీతారామన్ ఏపీ ప్రభుత్వమని నిర్ధిష్టంగా చెప్పలేదు కానీ దేశంలో ఓ రాష్ట్రం దుస్థితి ఇదీ అంటూ ఆమె వివరిస్తున్నప్పుడు అది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం గురించే అని అర్దమవుతోంది.

ఢిల్లీలో పార్లమెంట్ వేదికగా కేంద్ర ఆర్ధిక మంత్రి ఆంధ్రప్రదేశ్‌ ఆర్ధిక దుస్థితిని బయటపెట్టడం వైసీపీ ప్రభుత్వానికి అవమానకరంగా అనిపించకపోవచ్చు కానీ రాష్ట్ర ప్రజలు సిగ్గుతో తల దించుకొంటున్నారు. అసలు ప్రభుత్వోద్యోగులు, ఉపాధ్యాయులు నెలనెలా జీతాల కోసం రోడ్లపైకి ఆందోళనలు చేస్తుండటమే చాలా అవమానకరం. అయినా వైసీపీ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేకపోగా సజ్జల రామకృష్ణారెడ్డి చేత వంకర టింకర సమాధానాలు చెప్పిస్తూ వారి సహనాన్ని పరీక్షిస్తోంది.

వైసీపీలో సిఎం జగన్మోహన్ రెడ్డి మొదలు మంత్రులు, ఎమ్మేల్యేలు, నేతలు అందరూ కూడా అత్యంత విజయవంతంగా పరిశ్రమలు, వ్యాపారాలు, కాంట్రాక్టులు చేసుకొంటూ లాభాలు ఆర్జిస్తున్నారు. కనుక వారు ప్రభుత్వంలో పనిచేస్తున్నప్పుడు అంతే సమర్ధంగా పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధిపదంలో నడిపిస్తారని ప్రజలు ఆశిస్తారు. కానీ వారు 5 ఏళ్ళ తర్వాత జరిగే ఎన్నికల గురించి చాలా దూరదృష్టితో ఆలోచించి నవరత్నాలు, సంక్షేమ పధకాలను నిరాటంకంగా అమలుచేస్తున్నారే తప్ప రాష్ట్రం గురించి, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి గురించి బొత్తిగా ఆలోచించిస్తున్నట్లు లేదు! దీనిని ఏమనుకోవాలి?