Nirbhaya Rapists To Hang, Says Court2012, డిసెంబర్ 16వ తేదీన… దేశ రాజధాని ఢిల్లీ నడివీధుల్లో 23 సంవత్సరాల వైద్య విద్యార్థిని బస్సులో తిప్పుతూ దారుణాతి దారుణంగా ‘మానవత్వం’ అన్న పదానికి అర్ధం లేకుండా అత్యాచారం చేసి, ‘నిర్భయ’ మరణానికి కారకులైన నలుగురు నిందితులకు నాలుగేళ్ల తరువాత ఢిల్లీ హైకోర్ట్ ఉరిశిక్షను ఖరారు చేయడంతో యావత్ భారతం హర్షించింది. అయితే దీనిపై నిందితులు సుప్రీంకోర్టుకు వెళ్ళగా, తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా అదే తీర్పును అమలు చేయాల్సిందిగా తుది తీర్పును ఇవ్వడంతో మరోసారి భారతావని చప్పట్లు మ్రోగాయి.

దాదాపుగా సంవత్సరం పాటు సుప్రీంకోర్టులో నిర్విరామంగా విచారణ జరిగిన ఈ కేసు చాలా ప్రత్యేకమైనదిగా కోర్టు అభివర్ణించింది. భారతదేశ శిక్షా స్మృతిలో ఉరికి మించిన శిక్ష మరొకటి లేదు గనుక, ఈ నలుగురు నిందితులకు ఉరిశిక్షే సరని తేల్చిచెప్పింది. దీంతో సుప్రీంలో రివ్యూ పిటిషన్ వేస్తామని నిందితుల తరపు న్యాయవాది ఏపీ సింగ్ చెప్పగా, రివ్యూ కోరినప్పటికీ పెద్దగా ప్రయోజనం ఉండకపోదని, తనిచ్చిన తీర్పును సుప్రీం మళ్ళీ సవరించుకునే పరిస్థితులు ఉండబోవని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు.

అంటే తుది తీర్పే రివ్యూలో కూడా పునరావృతం అవుతాయని అంటున్న ఈ కేసులో మొత్తం ఆరుగురు నిందితులు కాగా, రామ్ సింగ్, తీహార్ జైల్లో మార్చి 2013లో ఉరి వేసుకుని మరణించిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం ఉరికి అర్హత సాధించిన అక్షయ్ థాకూర్, వినయ్ శర్మ, పవన్ గుప్తా, ముఖేష్ ల కంటే అత్యంత పాశవికంగా ప్రవర్తించిన అసలు నిందితుడు నేరం చేసే సమయానికి మైనర్ కావడంతో, మూడేళ్ల శిక్షా కాలం తరువాత డిసెంబర్ 2015లో విడుదలయ్యాడు.

నిజానికి నిర్భయ తల్లితండ్రులతో పాటు అందరూ కూడా ఈ మైనర్ ను విడుదల చేయడం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే భారతీయ చట్టాల రీత్యా, సదరు నిందితుడు విజయవంతంగా బయటపడగలిగాడు. నిర్బయ కేసు జరిగిన తరువాతనే, తీవ్రమైన నేరాల విషయంలో బాల నేరస్తుల వయసును 18 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాలకు తగ్గిస్తూ కూడా చట్టంలో మార్పులు తీసుకువచ్చారు. బహుశా అతను మైనర్ కాకుండా ఈ నలుగురితో పాటు ఉరి కంభం ఎక్కే జాబితాలో ముందువరుసలో ఉండి ఉండేవాడని చెప్పడంలో సందేహం లేదు. కానీ, ప్రస్తుతానికి మాత్రం మైనర్ తప్పించుకున్నట్లే..!