Nirbhaya Case Convicts Death penalty on 22nd January 2020
నిర్భయ హత్యాచారం కేసులో ఉరిశిక్ష పడిన దోషులకు అన్ని లీగల్ ఆప్షన్స్ అయిపోతున్నాయి. ఈ కేసులో దోషులు వినయ్ కుమార్ శర్మ, ముఖేశ్ సింగ్ పెట్టుకున్న క్యూరేటివ్ పిటిషన్లను సుప్రీంకో్ర్టు కొట్టివేసింది. ఈ మేరకు ఇవాళ సర్వోన్నత ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు వెలువరించింది. ఈ కేసులో మరో ఇద్దరు దోషులు పవన్ గుప్త, అక్షయ్ ఇప్పటి వరకు ఎలాంటి పిటిషన్ దాఖలు చేయలేదు.

ఒకవేళ వారు పెటిషన్స్ దాఖలు చెయ్యకపోతే వారికి ఉరి శిక్ష వాయిదా పడినట్టే. దోషులను ఈ నెల 22న ఉదయం 7గంటలకు ఉరితీయాలంటూ ఢిల్లీ హైకోర్టు ఈ నెల 7న డెత్ వారెంట్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉరిశిక్షకు ముందు ఉపశమనానికి కోర్టు పరంగా క్యూరేటివ్ పిటిషన్ ఒక్కటే మార్గం.

ఇప్పుడు కోర్టు తమ క్యూరేటివ్ పిటిషన్‌ను కొట్టివేయడంతో రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకునే అవకాశం ఉంది. క్షమాభిక్షకు రాష్ట్రపతి తిరస్కరిస్తే ఇక ఉరే తరువాయి అవుతుంది. అయితే ఒకవేళ వారు రాష్ట్రపతికి పిటీషన్ పెట్టుకున్నా వాటిని వెంటనే తిరస్కరించే అవకాశం ఉన్నట్టు సమాచారం.

అత్యాచారంలాంటి తీవ్రమైన నేరాల్లో ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష ప్రసాదించే ప్రసక్తే లేదని ఇటీవల రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. మరో ఇద్దరు దోషులు పవన్ గుప్త, అక్షయ్ కూడా చివరి నిముషంలో పిటీషన్ వేసినా దానిని వెంటనే పరిష్కరించనున్నట్టు సమాచారం.