Ninu Veedani Needanu Nene Trailer Talkఒక యువకుడు తనని తాను అద్దంలో చూసుకున్నప్పుడు వేరే మనిషిలా కనిపిస్తే ఏం జరుగుతుంది అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌ తో తెరకెక్కుతున్న సినిమా ‘నిను వీడ‌ని నీడ‌ను నేనే’. ఎమోషనల్‌ హర్రర్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సందీప్‌ కిషన్‌ హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ట్రైలర్‌ రిలీజ్‌ అయ్యింది. సందీప్‌ కిషన్‌ అద్ధంలో చూసుకుంటే ప్రతిబింబంలో వెన్నెల కిశోర్‌ కనిపిస్తాడు.

అలా కనిపించడానికి కారణం చాలా ఏళ్ల క్రితం ఒక బాలుడు అద్దంలో చూస్కుంటే ఒక పెద్దాయన రూపు కనపడటంతో ఆ గ్రామస్థులు ఆ బాలుడిని రాళ్లతో కొట్టి చంపుతారు. బహుశా వెన్నెల కిషోర్ గా మారిన ఆ బాలుడు తీసుకునే ప్రతీకారం ఇది కావొచ్చు. దానితో సుందీప్ కిషన్ పడే ఇబ్బందులలో కామెడీ కూడా పండించినట్టు ఉన్నారు. కాన్సెప్ట్ కొంచెం డిఫరెంట్ గా ఉంది సినిమాలో ఎలా వర్క్ అవుట్ అవుతుందో చూడాలి. జూలై 12న సినిమాను రిలీజ్‌ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.

ఈ సినిమాను వెంక‌టాద్రి టాకీస్‌, విస్తా డ్రీమ్ మ‌ర్చంట్స్ ప‌తాకాల‌పై ద‌యా ప‌న్నెం, వి.జి.సుబ్రహ్మణ్యన్‌ నిర్మిస్తున్నారు. తెలుగు, త‌మిళ భాష‌ల్లో రూపొందుతోన్న ఈ సినిమాకు కార్తీక్ రాజు ద‌ర్శకుడు. తమన్‌ సంగీతమందిస్తుండగా అన్య సింగ్ హీరోయిన్‌గా నటిస్తోంది. ఎ.కె.ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై అనీల్ సుంక‌ర ఈ చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు. చాలా కాలం నుండి సుందీప్ కిషన్ వరుస పరాజయాలతో సతమతం అవుతున్నాడు. ఈ సినిమా ఆయనను తిరిగి హిట్ ట్రాక్ లో పెడుతుందేమో చూడాలి.