Nimmala RamaNaidu toured peddalanka villageసాధారణ సమయంలో పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాలు ఎంతో చూడముచ్చటగా ఉంటాయి. కానీ ఇప్పుడు భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నాయి. లంక గ్రామాలలో చాలా ఇళ్ళలోకి నీళ్ళు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు.

కొందరు ఇంట్లో ముఖ్యమైన సామాన్లను పడవలలో వేసుకొని సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్ళగా, మరికొందరు ఇళ్ళు విడిచివెళితే దొంగతనాలు జరుగుతాయనే భయంతో ఇళ్ళలోనే బిక్కుబిక్కుమని గడుపుతున్నారు. చాలా గ్రామాలలో సుమారు రెండు మూడు అడుగుల ఎత్తున వరద నీరు నిలిచిపోవడంతో, త్రాగునీరు, నిత్యావసర సరుకులు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు.

టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు, సర్పంచ్ తాళ్ళ నాగరాజు స్థానిక టిడిపి నేతలు, కార్యకర్తలతో కలిసి పెదలంక గ్రామంలో శుక్రవారం పర్యటించారు. నాలుగు అడుగుల ఎత్తున నిలిచిపోయిన నీటిలో వారు ఇంటింటికీ వెళ్ళి వారి పరిస్థితిని అడిగి తెలుసుకొని, వారికి అత్యవసరంగా ఏమేమి కావాలో నోట్ చేసుకొన్నారు. ఎటువంటి అవసరమున్నా తమకు ఫోన్‌ చేయాలని చెప్పారు. తాము వెనక్కు తిరిగి వెళ్ళగానే అధికారులతో మాట్లాడి వారికి అవసరమైనవన్నీ అందేలా చేస్తామని నిమ్మల రామానాయుడు హామీ ఇచ్చారు. ఒకవేళ అధికారులు సహకరించకపోతే టిడిపి తరపున తాను అన్ని పంపిస్తానని చెప్పారు.

నరసాపురంలో లాకుపేట గ్రామం కూడా నీట మునిగింది. టిడిపి నియోజకవర్గం ఇన్‌చార్జ్ పొత్తూరి రామరాజు, టిడిపి నేతలు జక్కం శ్రీమన్నారాయణ, కొల్లు పెద్దిరాజు, తామరపు వేంకటేశ్వర రావు, కొప్పాడ రవి, భాస్కర్ నాయుడు, మల్లాది మూర్తి, నాని, నాగిశెట్టి, మౌలాలీ, సునీత, రాంబాబు తదితరులతో కలిసి శుక్రవారం లాకుపేట గ్రామంలో మోకాలి లోతు నీటిలో ఇంటింటికీ తిరుగుతూ అందరి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. అందరికీ టిడిపి తరపున నిత్యావసర సరుకులు, త్రాగునీరు వగైరా తెచ్చి అందిస్తామని ఎవరూ అధైర్యపడవద్దని చెప్పారు.