Nimmala RamaNaidu about three capitals in assembly నేడు శాసనసభ సమావేశాల తొలిరోజున రాజధాని అంశంపై జరిగిన స్వల్పకాలిక చర్చలో ఆర్ధికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సభలో మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే అధికార వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని వాదించారు.

దీనిపై టిడిపి ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆయనతో సహా వైసీపీ సభ్యులందరికీ గట్టిగా చురకలు అంటించారు. నిమ్మల సభలో మాట్లాడుతూ, “ఆ రోజు మేము అమరావతిని ఇదే శాసనసభలో రాజధానిగా ప్రకటిస్తే అప్పుడు మీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సహా మీరందరూ బల్లలు చరిచి హర్షద్వానాలు చేశారు. రాజధానికి కనీసం 30 వేల ఎకరాలు అవసరమని మాతో వంతపాడారు. ఎన్నికలలో కూడా అమరావతిని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పలేదు. అమరావతినే రాజధాని అన్నట్లు ప్రజలను భ్రమలో ఉంచి, మాయమాటలు చెప్పి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చారు.

అధికారంలోకి రాగానే మడమ తిప్పి మాట మార్చి అమరావతి వద్దు… రాష్ట్రాభివృద్ధికి అధికార వికేంద్రీకరణ అవసరం కనుక మూడు రాజధానులు చాలా అవసరమని మూడేళ్ళుగా చెపుతునే ఉన్నారు. కానీ మీ నిర్ణయాన్ని ప్రజలు, హైకోర్టు వ్యతిరేకిస్తున్నా నేటికీ అదే పాట పాడుతున్నారు.

ఆనాడు మా ప్రభుత్వం కట్టిన సచివాలయంలోనే మీ ప్రభుత్వం నడుస్తోంది. ఆనాడు మా ప్రభుత్వం కట్టిన శాసనసభలోనే ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఆనాడు మా ప్రభుత్వం సేకరించిన భూములలోనే మీ ముఖ్యమంత్రి, ఎమ్మెల్యేలు భూములు కొనుకొన్నారు… ఇళ్ళు కట్టుకొన్నారు. ఆనాడు మా అధినేత చంద్రబాబు నాయుడు ఎంతో దూరదృష్టితో తీసుకొన్న నిర్ణయం వలననే నేడు మీరు రాజధానికి పైసా ఖర్చు పెట్టకుండా ప్రభుత్వం నడిపించుకోగలుగుతున్నారని మరిచిపోవద్దు.

130 కోట్లు పైగా జనాభా ఉన్న భారతదేశానికి ఢిల్లీలో ఒకే ఒక రాజధాని ఉంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఢిల్లీ నుంచే పరిపాలన సాగుతోంది. అయినా దేశంలో అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నాయి. 20 కోట్లు పైగా జనాభా ఉన్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి లక్నో ఒక్కటే రాజధానిగా ఉంది. అక్కడా పరిపాలన సజావుగా సాగుతోంది. కానీ 5 కోట్లు జనాభా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమా?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కావలసింది పరిపాలన వికేంద్రీకరణ కాదు… అభివృద్ధి వికేంద్రీకరణ మాత్రమే. మీరు అమరావతిని రాజధానిగా చేసి రాష్ట్రంలో అన్ని జిల్లాలను అభివృద్ధి చేస్తామంటే మేము వద్దంటామా? ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం అభివృద్ధి చెందాలని మీరు అంతగా పరితపించిపోతున్నట్లయితే ఈ మూడేళ్ళలో ఎందుకు అభివృద్ధి చేయలేదు? మీ అనాలోచిత నిర్ణయాలతో రాష్ట్రం ఎంతగా నష్టపోతోందో సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా వైసీపీ నేతలు ఎవరికీ కనబడటం లేదా?” అంటూ నిమ్మల రామానాయుడు కడిగి పడేశారు.