Nimmagadda -Ramesh Kumar - YS Jaganరాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోయినా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ని ఈ ఉదయం విడుదల చేశారు. ఆ సమావేశం తరువాత మీడియా అడిగిన ప్రశ్నలకు నిమ్మగడ్డ సమాధానం చెప్పకుండానే వెళ్లిపోయారని సాక్షి ఒక కథనం ప్రచురించింది.

“అరగంట సేపు ప్రసంగం చేసి మీడియా సందేహాలను.. నివృత్తి చేయలేదు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత.. మీడియా సందేహాలను నివృత్తి చేయటం ఆనవాయితీ. ఇందుకు భిన్నంగా నిమ్మగడ్డ తాను రాసుకొచ్చిన స్క్రిప్టు చదివి వెళ్లిపోయారు,” అంటూ సాక్షి చెప్పుకొచ్చింది. అయితే దీనిపై సోషల్ మీడియా లో భిన్న వాదనలు ఉండటం గమనార్హం.

“నిమ్మగడ్డ మీడియా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు సరే… ఆనవాయితీ తప్పారు అనుకుందా? మరి అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండేళ్లు పూర్తి చేసుకుంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఇప్పటివరకు ఎన్ని సార్లు మీడియా ముందుకు వచ్చి… మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పారు. సీఎం ని మీడియా ప్రశ్నలు అడిగే ఆనవాయితీ కూడా ఉంది కదా?,” అంటూ విమర్శిస్తున్నారు.

ముఖ్యమంత్రి జగన్ మీడియా ముందుకు రావడం చాలా చాలా అరుదు. వచ్చినప్పుడు ఆయన చెప్పాలి అనుకున్నది చెప్పుకుని వెళ్ళిపోతారు. ఎక్కువగా రివ్యూ మీటింగులలో లేదా పబ్లిక్ మీటింగులలో ఆయన ముందే ప్రిపేర్ అయ్యి వచ్చిన స్పీచ్ ని చదివి వినిపిస్తారు. దానినే మీడియా రాసుకుంటుంది కూడా.