Nimmagadda Ramesh Kumar -ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ మధ్య ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతుంది. ఒకవైపు ప్రభుత్వం కోడ్ అమలు లో ఉన్నా మంత్రులతో నిమ్మగడ్డ మీద విమర్శలు చేయిస్తుంది. అయితే నిమ్మగడ్డ తక్కువ మాట్లాడుతూ…. తనకున్న విశేష అధికారాలతో గట్టిగానే ఎదురుకుంటున్నారు.

తాజాగా ఆయన ముఖ్యమంత్రి కుడి ఎడమ భుజాలుగా చెప్పుకునేవారినే టార్గెట్ చేశారు. ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని ఆ పదవి నుండి తొలగించాలని, అలాగే సీఎంవో ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌ను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని సూచిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాసుకు ఎస్ఈసీ లేఖ రాశారు.

సజ్జల రామకృష్ణారెడ్డి జగన్ కు అత్యంత సన్నిహితుడు… ఆయనను ప్రతిపక్షాలు ఏకంగా సూడో చీఫ్ మినిస్టర్ అంటారు. ఇక ప్రవీణ్ ప్రకాష్ సంగతికి వచ్చేసరికి ఆయన చాలా కాలంగా సీఎంఓలో అంతా తానే అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఆయన కోసం అప్పట్లో ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని కూడా జగన్ వదులుకున్న సంగతి తెలిసిందే.

అయితే ఈ విషయంలో ప్రభుత్వం ఏం చెయ్యబోతుందో చూడాలి. ఇప్పటికే నిమ్మగడ్డ తన పరిధి దాటుతున్నారని… నిమ్మగడ్డ చెప్పిన విధంగా ఇద్దరు ఐఏఎస్‌లపై (గోపాలకృష్ణ ద్వివేది, గిరిజా శంకర్) చర్యలు తీసుకోవద్దని ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. తన పరిధి దాటి వ్యవహరించవద్దని ఎస్‌ఈసీకి సూచించాలని కోరింది. ఇప్పుడు ఈ తాజా పరిణామాల పై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.