Nimmagadda -Ramesh Kumar - YS Jaganఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికలలో నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన పంతం నెగ్గించుకున్నారు. చెప్పిన విధంగానే తాను పదవి నుండి దిగిపోయేలోపు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. దానిని ఆపడానికి ప్రభుత్వం సుప్రీం దాకా వెళ్లి అభాసుపాలు అయ్యింది. అయితే నిమ్మగడ్డ రమేష్ కుమార్ అక్కడితో ఆగేలా కనిపించడం లేదు.

నిమ్మగడ్డ సారథ్యంలోనే అధికార పార్టీ మరో ఎన్నికను ఎదురుకోవాల్సి రావొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని అన్ని మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్, అన్ని డివిజన్లలో ఎన్నికల నోటిఫికేషన్ ఫిబ్రవరి 22 వ తేదీన ఆయన ప్రకటించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఆయన రిటైర్ అయ్యేలోపు ఆ తంతు కూడా ముగించాలని ఆలోచనగా ఉందట.

సహజంగా గ్రామీణ ప్రాంతాలలో ఉన్నంత పట్టు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పట్టణ ప్రాంతాలలో లేదు. అక్కడ ఉచిత పథకాల ప్రభావం కూడా తక్కువే ఉంటుంది. కాబట్టి ఈ తరుణంలో అది కూడా నిమ్మగడ్డ సారథ్యంలో మునిసిపాలిటీ, మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలను ఎదురుకోవడానికి సిద్ధంగా లేకపోవచ్చు.

ఆ ఎన్నికలు జరిగి ప్రతిపక్షాలకు ఎంతో కొంత అనుకూలంగా ఫలితాలు వచ్చినా అధికారపార్టీకి ఇబ్బందే. దానితో మరోసారి కోర్టు కేసుల పేరిట తప్పించుకునే ప్రయత్నం చెయ్యాల్సి రావొచ్చు. అయితే అప్పటికి నిమ్మగడ్డ పదవీకాలం ఒక్క నెలకు అటుఇటుగా మాత్రమే ఉండటంతో ఏదో విధంగా ఆలస్యం చెయ్యవచ్చు అని అధికార పార్టీ ఆలోచన చేస్తుందని సమాచారం. చూడాలి ఏం జరగబోతుంది అనేది!