Nimmagadda Ramesh Kumar-YS Jaganమాజీ రాష్ట్ర ఎన్నికల అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఇష్యూ మరోసారి హైకోర్టుకు చేరింది. తనను మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలన్న హైకోర్టు తీర్పుని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇది కోర్టు ధిక్కారమే అంటూ ఆయన హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. ఇందులో సీఎస్‌, పంచాయతీ రాజ్‌ శాఖ కార్యదర్శి, ఏపీ ఎన్నికల కార్యదర్శిని ప్రతివాదులుగా చేర్చారు.

“హైకోర్టు తీర్పును ప్రభుత్వం అమలు చేయట్లేదని, తన ఉద్యోగం తనకు ఇవ్వడం లేదు. ఇది కోర్టు ధిక్కారమే,” అంటూ ఆయన పేర్కొన్నారు. గతంలో హైకోర్టు తీర్పు పై స్టే ఇవ్వాలని ప్రభుత్వం రెండు సార్లు సుప్రీం కోర్టుని ఆశ్రయించింది. అయితే రెండు సార్లు ఆ తీర్పు మీద స్టే ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

ఈ విషయంలో జగన్ ప్రభుత్వానికి ఇబ్బంది తప్పకపోవచ్చని న్యాయనిపుణులు అంటున్నారు. మరోవైపు నిమ్మగడ్డ బీజేపీ నాయకులు… సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్ తో ఒక ప్రైవేట్ హోటల్ లో సమావేశం కావడం, దానికి సంబంధించిన వీడియోని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు విడుదల చెయ్యడం సంచలనం సృష్టించింది.

అయితే రాజకీయంగా ఈ వీడియోతో కొంత మేర ఏమైనా లాభపడొచ్చేమో గానీ కోర్టులలో ఇది పెద్దగా ప్రభావం చూపించే అవకాశం లేదని న్యాయనిపుణులు అంటున్నారు. మొత్తానికి పంతానికి పోయినా నిమ్మగడ్డ నేతృత్యం లోనే ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలు జరిగే అవకాశం కనిపిస్తుంది.