nimmagadda ramesh kumarరాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు రాష్ట్ర ప్రభుత్వానికి జరుగుతున్న ప్రచ్ఛన్న యుద్ధం గురించి తెలిసిందే. అనుకున్న ప్రకారమే నిమ్మగడ్డ తాను వెళ్లిపోయే ముందు పంచాయితీ ఎన్నికలు జరిపే వెళ్తున్నారు. రోజుకో రకంగా ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతున్నారు. అయితే అన్నిటికీ ఒక్కటే మంత్రం అన్నట్టు మంత్రులతో ఆయన చంద్రబాబు మనిషి అంటూ ఆరోపణలు చేయిస్తున్నారు.

వాటిని తిప్పికొట్టడానికా అన్నట్టు… రమేష్ కుమార్ వ్యూహాత్మకంగా దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పేరును ప్రస్తావించినట్లు కనిపిస్తుంది.కడప జిల్లాకు వైఎస్ పేరు పెట్టారని ఆయన గుర్తు చేసుకున్నారు. వైఎస్ హయాంలో తను ఆర్దిక శాఖ కార్యదర్శిగా పనిచేశానని, ఆయనకు నిజాలే చెప్పేవాడినని , వైఎస్ సూచనమేరకే రాజ్ భవన్ కు వెళ్లానని, అక్కడ ఏడేళ్లు పనిచేశానని, రాజ్ భవన్ ఆశిస్సులతో తాను కమిషనర్ పదవి పొందానని రమేష్ కుమార్ వివరించారు.

అలాగే వైఎస్ హయాంకు సంబంధించి తదుపరి పరిణామాలకు సంబంధించి తాను సాక్షినని కూడా ఆయన వెల్లడించారు. వైఎస్ లౌకిక వాది అని, తన హృదయంలో ఆయనకు ఒక ప్రత్యేక స్థానం ఉంటుందని ఆయన చెప్పారు. ఒకరకంగా తాను చంద్రబాబు తొత్తుని అంటూ వస్తున్న విమర్శలకు ఆయన ఇండైరెక్టుగా సమాధానం చెప్పినట్టు అయ్యింది.

ఒక రిటైర్డ్ ఐఏఎస్ కు ఈ రాజకీయ తెలివితేటలు ఎలా వచ్చాయి? పలువురు వ్యాఖ్యానించడం విశేషం. అయితే ఎవరు అధికారంలో ఉన్నా చక్రం తిప్పేది ఐఏఎస్ అధికారులే. ఆ విధంగా రాజకీయ నాయకుల కంటే కూడా ఇటువంటి విషయాలలో సీనియర్ అధికారులు రెండాకులు ఎక్కువే చదివి ఉంటారు.