Nikhil Siddhartha tweets on piracyఒకప్పుడు మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి అగ్ర హీరోలు కూడా ఫైట్ చేసిన ‘పైరసీ’ అనే అంశం, ఇప్పుడు పూర్తిగా దూరమైందనే చెప్పవచ్చు. ‘తమ సినిమాను ధియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి’ అన్న ఓ చిన్న ముక్క మాత్రం అందరూ చెప్తున్నారు గానీ, గత కొంతకాలంగా ‘పైరసీ’ని సినీ పెద్దలు కూడా విస్మరించారు. బహుశా పైరసీని నియత్రించడం సాధ్యం కాదని భావించారో ఏమో గానీ, దానిపై మచ్చుకు కూడా మాట్లాడకుండా, ప్రత్యామ్నాయంగా తొలిరోజు వీలైనన్ని ఎక్కువ ధియేటర్లలో సినిమాను రిలీజ్ చేసుకుంటూ, కలెక్షన్స్ ను రాబట్టుకుంటున్నారు.

సినిమా హిట్టయితే పర్లేదు… జనాలు ధియేటర్లకు వచ్చి చూస్తున్నారు. కానీ ఏ మాత్రం తేడా కొట్టినా ధియేటర్లకు వెళ్ళడానికి సంశయించే పరిస్థితి నెలకొంది. దీనికి తోడు పెరుగుతున్న ఇంటర్నెట్ విప్లవం ప్రతి ఒక్కరి చేతిలో ప్రపంచాన్ని చూపిస్తోంది. ఊహించని ప్రపంచమే కళ్ళ ముందునపుడు… సినిమా పైరసీ ప్రింట్లు ఒక లెక్కా..! దాదాపుగా ప్రతి కొత్త సినిమా కూడా తొలి రోజునే పైరసీ బారిన పడి, రిలీజ్ అయిన కాసేపటికే ఇంటర్నెట్ లో ప్రత్యక్షం అవుతున్నాయి. ఎంతో కొంత ఇవి సినిమా కలెక్షన్స్ కు గండి కొడుతున్నాయని చెప్పడంలో సందేహం లేదు.

‘బాహుబలి’ విషయంలో రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని, ముందస్తు హెచ్చరికలు చేసినప్పటికీ, తొలిరోజునే పైరసీ ప్రత్యక్షం అయ్యింది. అలాగని చట్టబద్ధంగా సదరు వెబ్ సైట్స్ పై చర్యలు ఏమైనా తీసుకున్నారా? అంటే… అప్పటినుండి ఇప్పటివరకు పేరు మార్పులతో కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా వీటిపై కోన వెంకట్ తెలంగాణా మంత్రివర్యులు కేటీఆర్ కు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. కోన వెంకట్ చేసిన ఫిర్యాదుకు మరో యువహీరో నిఖిల్ స్పందిస్తూ… ఇంకో వెబ్ సైట్ పేరు చెప్తూ ‘తొలిప్రేమ’ సినిమాకు సంబంధించిన పైరసీ లింక్ ను పోస్ట్ చేసారు.

“ఈ రెండు వెబ్ సైట్స్ ను బ్లాక్ చేయించడంలో మేము విఫలమయ్యాము, కాస్త చూడండి” అంటూ నిఖిల్ చేసిన పోస్ట్ ను నెటిజన్ల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నాయి. ‘డోంట్ వర్రీ… మేం ఇప్పటికే సినిమాను చూసేసాం…’ అంటూ కొందరు అంటుంటే, ‘ధియేటర్లోనే చూస్తాం…’ అంటూ మరికొందరు అభిప్రాయ పడుతున్నారు. ఇలా సహకారం అందించే వారితో పాటు… ‘ధియేటర్లలోని టికెట్ ధరలను తగ్గించండి… ఆటోమేటిక్ గా మేము సినిమాను వస్తాం…’ అంటూ ఇంకొందరు కుండబద్దలు కొడుతూ చెప్తున్నారు. భిన్న వాదనలు ఎలా ఉన్నా… ఈ పైరసీ వెబ్ సైట్స్ పై టాలీవుడ్ లో కలకలం మొదలైనట్లే కనపడుతోంది.

మరి ప్రభుత్వం ఈ సినీ సెలబ్రిటీల గోడు విని అడ్డుకట్ట వేయగలుగుతుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే కేసీఆర్ సర్కార్ వచ్చిన నాటి నుండి సినీ సెలబ్రిటీల విషయంలో తెలంగాణా ప్రభుత్వం అనేక అంశాలలో సహకారం అందిస్తోంది. మరి కీలకమైన పైరసీ విషయంలోనూ లభిస్తుందా? కోన వెంకట్ ట్విట్టర్ ఖాతాతో ప్రారంభమైన ఈ ఫిర్యాదుల వెల్లువలో పెద్ద తలకాయలు పాలు పంచుకుంటే… ఫలితం టాలీవుడ్ కు అనుకూలంగా ఉండే అవకాశం లేకపోలేదు అంటున్నారు సినీ వర్గాలు. అయితే ఆ “పెద్దలు” ఈ ట్విట్టర్ విప్లవంలో భాగస్వామ్యులు అవుతారా? లేదా? అనేది చూడాలి.