nikhil-siddharth-says-no-black-money-responds-modi-notes-banసినీ పరిశ్రమలో నల్లధనానికి కొదవలేదన్నది జగమెరిగిన సత్యమే. ఆ ప్రభావంతోనే ఇటీవల ‘బాహుబలి’ నిర్మాతలపై కూడా ఐటీ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో ఎంత లభించింది అన్న విషయం పక్కన పెడితే, సినీ పరిశ్రమకు, బ్లాక్ మనీకి చాలా అవినాభావ సంబంధం ఉందని అందరూ ఒప్పుకుని తీరాల్సిందే. ఈ పెద్ద నోట్ల ప్రభావంతో అన్ని సినిమాలు వాయిదాలు పడుతున్నా, నిఖిల్ హీరోగా నటించిన “ఎక్కడికి పోతావు చిన్నవాడా” మాత్రం అనుకున్న సమయానికే విడుదల అవుతోంది.

ఈ నేపధ్యంలో హీరో నిఖిల్ ఇస్తున్న ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బ్లాక్ మనీ అంశంపై ప్రస్తావించారు. ‘మోడీ తీసుకున్న నిర్ణయం అద్భుతమని, గత వారంతో పోలిస్తే… ఈ వారం ప్రజల ఇబ్బంది కాస్త తగ్గిందని, ఓ 50 రూపాయలు ఉంటే సినిమా చూసేయొచ్చు అన్న నమ్మకంతో మా సినిమాను విడుదల చేస్తున్నామని’ చెప్పిన నిఖిల్, “తాను హీరోగా సంపాదిస్తున్నదంతా వైట్ మనీయే అని, నిజానికి దాచుకునేటంత తాను సంపాదించలేదని” చెప్పుకొచ్చారు.

ఈ సినిమా కధ చెప్పేస్తే ఫీల్ పోతుందని, అయితే రొటీన్ దెయ్యాల హర్రర్ మూవీల మాదిరి అయితే ఖచ్చితంగా మా సినిమా ఉండదని, ఈ రోజుల్లో కొత్తదనం లేకుండా ప్రేక్షకులను మెప్పించడం కష్టమని, అందుకే తన సినిమాలలో వైవిధ్యం కనపడుతుందని చెప్పాడు నిఖిల్. తానూ నటించిన సూపర్ హిట్ సినిమా “కార్తీకేయ”కు సీక్వెల్ వస్తుందని, ఇప్పటికే కధ సిద్ధమైందని, ‘కార్తికేయ’ సినిమాను మించి ఈ కధ ఉంటుందని, దర్శకుడు చందుకు ఉన్న కమిట్మెంట్స్ పూర్తి కాగానే ఈ సినిమా మొదలవుతుందని చెప్పుకొచ్చారు.