Nikhil Siddharth - Keshava Collectionsవరుసగా వినూత్నమైన కధలను ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల మదిలో ఇప్పుడిప్పుడే సుస్థిర స్థానం సంపాదించుకునే దిశగా అడుగులు వేస్తున్న యువ హీరో నిఖిల్ తాజాగా నటించిన “కేశవ” చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది. అయితే ఇదే సినిమా యుఎస్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. మరి తెలుగు రాష్ట్రాలలో కనిపించిన హంగామా, యుఎస్ ప్రేక్షకుల వద్ద ఎందుకు కనిపించకుండా పోయింది అన్నది ఆసక్తికరంగా మారింది.

అందులోనూ నిఖిల్ నటించిన గత చిత్రం “ఎక్కడికి పోతావు చిన్నవాడా” 7.16 లక్షల డాలర్స్ ($716 K) వసూళ్లు చేసిన తర్వాత, సహజంగానే ఇదే స్థాయిలో తదుపరి సినిమా కలెక్షన్స్ ఉంటాయని ట్రేడ్ పండితులు భావించారు. కానీ, “కేశవ” ప్రీమియర్స్ మరియు తొలి మూడు రోజులు కలిపి కేవలం 1.98 లక్షల డాలర్స్ ($198 K) ను మాత్రమే వసూలు చేయడం విస్మయాన్ని కలిగించే విషయమే. యుఎస్ ప్రేక్షకులు ఎక్కువగా ‘రివ్యూ’లపై ఆధారపడి సినిమాలకు వెళ్తారన్న విషయం జగమెరిగిన సత్యమే.

అలా చూసుకున్నా… ఈ సినిమాకు దారుణమైన ‘డివైడ్ టాక్’ రాలేదు, అలాగని సూపర్ గా ఉందన్న ‘మౌత్ టాక్’ కూడా లేదు, ఏదో ‘చూడొచ్చు’ అన్న టాక్ ఎక్కువగా వ్యక్తమవుతోంది. అంతకుముందే ‘బాహుబలి 2’ కోసం యుఎస్ లో ఒక్కో కుటుంబం దాదాపుగా 100 నుండి 150 డాలర్లు ఖర్చు పెట్టి ఉండడంతో, ఓ సాధారణ మూవీగా వచ్చిన “కేశవ”కు వెచ్చించే అవకాశం లేకుండా పోయిందన్నది ఓ ప్రధాన కారణంగా తెలుస్తోంది. ‘బాహుబలి 2’ ప్రభావం ఒక్క ‘కేశవ’ పైనే కాదు, అంతకుముందు వారంలో విడుదలైన ‘రాధ’ పైన కూడా పడిందన్నది తెలిసిందే.

‘బాహుబలి 2’ తర్వాత తెలుగు సినిమాలకు యుఎస్ ప్రేక్షకులు ఇస్తున్న తీర్పును చూస్తుంటే… 26న విడుదల కాబోతున్న చైతూ “రారండోయ్ వేడుక చూద్దాం” సినిమాకు కూడా ఎంత ఆదరణ లభిస్తుందన్నది ప్రశ్నార్ధకంగానే ఉంది. ఓ పెద్ద హీరో సినిమా అయితే గానీ మళ్ళీ ప్రేక్షకులు ధియేటర్లకు క్యూలు కట్టే విధంగా కనపడకపోవడంతో, యుఎస్ బాక్సాఫీస్ కళకళలాడాలంటే “దువ్వాడ” బరిలోకి దిగాల్సిందేనా? లేదా అంతకుముందు ఏ చిన్న సినిమా అయినా షాక్ ఇస్తుందా? అనేది చూడాలి.

ప్రస్తుతం ధియేటర్లలో ఉన్న నిఖిల్ “కేశవ” మహా అయితే 3 లక్షల డాలర్స్ లో క్లోజ్ అవుతుందన్నది ట్రేడ్ వర్గాల అంచనా. ఈ లెక్కన చూస్తే అమెరికాలో నిఖిల్ మార్కెట్ ఏర్పరచుకోవడానికి ఇంకాస్త సమయం పట్టేలా కనపడుతోంది. కెరీర్ లో సెకండ్ హయ్యెస్ట్ అందుకున్నప్పటికీ, ‘కార్తీకేయ’ సినిమాకు లభించింది కేవలం 1.94 లక్షల డాలర్స్ ($194 K) అన్నది తెలిసిందే. ఏదైనా ఒక క్రేజీ డైరెక్టర్ చేతిలో పడితే తప్ప, అమెరికాలో నిఖిల్ మార్కెట్ స్థిరపడేలా కనపడడం లేదు.