Nike gives new training kits to Team India!విరాట్ కోహ్లీ కెప్టెన్సీ పట్టాలు చేపట్టిన నాటి నుండి జట్టు ఎంత బాగా రాణిస్తుందో, అంతేస్థాయిలో ఏదొక వివాదం టీమిండియాను చుట్టుముడుతోంది. ఇటీవలే అభిప్రాయ బేధాలతో మాజీ కోచ్ అనిల్ కుంబ్లేపై ఫిర్యాదు చేసి, అతని రాజీనామాకు కోహ్లీ కారణమయ్యాడంటూ మీడియాలో వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. శ్రీలంకపై జట్టు చెలరేగడంతో, ఆ అంశం ఇప్పుడిప్పుడే తెరమరుగవుతున్న నేపధ్యంలో…. తాజాగా టీమిండియా రెండో ఫిర్యాదును జట్టు అపెరల్ పార్టనర్ నైకీపై చేసింది.

2006 నుంచి టీమిండియాకు నైకీ సంస్థ జెర్సీలు, షూస్ జట్టుకు అందిస్తోంది. ఇన్నేళ్లలో ఏ కెప్టెన్ కూడా బీసీసీఐకి నైకీపై ఫిర్యాదు చేసినట్టు వార్తలు రాలేదు. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే నేరుగా సంస్థకు చెప్పి, తమకు అనుకూలమైన కిట్లను తెప్పించుకునేవారు. అయితే తాజాగా జట్టు నైకీపై ఫిర్యాదు చేయడం వెనుక టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ్యూహం కనిపిస్తోంది. విరాట్ కోహ్లీ ఈ మధ్యే ‘పూమా’ సంస్థతో 110 కోట్ల రూపాయల భారీ ఒప్పందాన్ని చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ‘పూమా’కు భారత్ లో పెద్దగా మార్కెట్ లేదు.

భారత్ లో నైకీ, అడిడాస్ లకు మాత్రమే మంచి మార్కెట్ ఉండగా, ఎలాగైనా ఇండియన్ మార్కెట్ లో పాగా వేయాలనుకుంటున్న పూమా టీమిండియా కెప్టెన్ తో పావులు కదుపుతోందని, అందులో భాగంగానే నైకీపై టీమిండియా ఫిర్యాదులు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. భారత్ లో క్రికెట్ జట్టుకు విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ఇందులో కోహ్లీకి ఉన్న ఫాలోయింగ్ గురించి చెప్పనవసరం లేదు. జట్టులో అతను ఏది చెబితే అది జరిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. దానికి ఉదాహరణే కుంబ్లే రాజీనామా!

ఈ నేపథ్యంలో నైకీని తప్పించేందుకు అవసరమైతే కాంట్రాక్టును రద్దు చేయవచ్చు అన్న క్లాజును ఉపయోగించుకునే అవకాశం కనిపిస్తోంది. 2020 వరకు నైకీతో ఉన్న కాంట్రాక్టును రద్దు చేసుకుని పూమాతో కొత్త కాంట్రాక్టు మరింత భారీ మొత్తానికి చేసుకునే వెసులు బాటు కనిపిస్తోంది. భారీ మొత్తం అన్నది బీసీసీఐని ఆకర్షిస్తుందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అసలు ఇంతకీ నైకీపై టీమిండియా ఫిర్యాదులు ఏమిటంటే… గత కొన్ని నెలలుగా తాము ధరిస్తున్న జెర్సీలు ‘నాసిరకంగా’ ఉన్నాయట! మరి ‘నైకీ’ సంస్థపై విరాట్ వేసిన పాచిక పారుతుందో లేదో తెలియాలంటే మరికొంత కాలం వేచిచూడాలి.