Nijam with smithaఒకప్పుడు ముఖాముఖీ పేరుతో వచ్చే ఇంటర్వ్యూలు కేవలం సినిమా పత్రికలకు మాత్రమే పరిమితమయ్యేవి. కేవలం చదివే అవకాశం తప్ప ప్రత్యక్షంగా వాటిని చెప్పిన సెలబ్రిటీల ఎక్స్ ప్రెషన్లు చూసే ఛాన్స్ ఉండేది కాదు. తర్వాత కేబుల్ టీవీ, శాటిలైట్ ఛానల్స్ వచ్చాక అప్పుడప్పుడు స్టార్లు స్టూడియోలకొచ్చి తమ మనసులో మాటలు పంచుకునేవాళ్ళు. యూట్యూబ్ రంగప్రవేశం చేశాక వీటి స్వరూపం ఇంకో స్థాయికి చేరుకుంది. ఓటిటిలు ఎంట్రీ ఇచ్చాక ఈ ట్రెండ్ నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది. కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి.

బాలయ్య నిర్వహించిన అన్ స్టాపబుల్ రెండు సీజన్లూ సూపర్ హిట్ అయ్యాయి. ముఖ్యంగా ప్రభాస్ పవన్ కళ్యాణ్ ఎపిసోడ్లు ఓ రేంజ్ లో పేలాయి. తాజాగా సింగర్ స్మిత ఇదే కాన్సెప్ట్ తో వచ్చింది. ఏకంగా చిరంజీవి చంద్రబాబు నాయుడు లాంటి బిగ్ షాట్స్ తో ఆల్రెడీ ఒక సిరీస్ కు సరిపడా షూటింగ్ గత ఏడాదే పూర్తి చేసింది. స్ట్రీమింగ్ ఆలస్యమయ్యింది. గతంలో మంచు లక్ష్మి, రానా, సమంతా వేర్వేరు సందర్భాల్లో ఇతర ప్లాట్ ఫార్మ్స్ కోసం ఇలా యాంకర్లుగా మారినవాళ్ళే. కొందరు ప్రభావం చూపించగలిగారు కొందరు అంచనాలు అందుకోలేకపోయారు.

ఇప్పుడు వెబ్ సైట్లు, యూట్యూబ్ ఛానల్స్, ప్రైవేట్ యాంకర్స్ ఇలా ఎవరి స్థాయికి తగ్గట్టు వాళ్ళు సెలబ్రిటీ ఇంటర్వ్యూలతో వీలైనంత ఎక్స్ పోజర్ ని ఫ్యాన్స్ కి ఇచ్చేందుకు పోటీ పడుతున్నారు. ఇందులో కొత్త సినిమాల ప్రమోషన్లు, తారల తాలూకు వ్యక్తిగత ముచ్చట్లతో పాటు బాధలు వ్యధలు, సంతోషాలు దుఃఖాలు అన్నీ పొందుపరుస్తున్నారు. వాళ్ళ పాపులారిటీని బట్టి వ్యూస్ మిలియన్లలోకి వెళ్లడం లేదా లక్షల్లో ఆగడం జరుగుతుంది. ఈ మధ్య వీటి తాకిడి ఇబ్బడిముబ్బడిగా పెరగడంతో ఏది చూడాలనే కన్ఫ్యూజన్ నెలకొంటోంది.

భవిష్యత్తు కోణంలో ఆలోచిస్తే ఇదంతా ప్రారంభమే. ఇన్స్ టాలు టిక్ టాకులు వాడి ముక్కు మొహం తెలియని వాళ్లే పేరు తెచ్చుకుని సొమ్ములు చేసుకుంటున్న ట్రెండ్ లో ఫాలోయింగ్ ఉన్న నటులు సాంకేతిక నిపుణులు స్క్రీన్ ముందుకు రావాలని కోరుకోవడంలో ఆశ్చర్యం లేదు. ఇదిలాగే కొనసాగుతుంది. కాకపోతే ఏదైనా మితంగా ఉంటేనే అతుకుతుందన్నట్టు అన్నిట్లో ఒకే సెలబ్రిటీ కనిపించినా చిక్కే. బోర్ కొట్టే ప్రమాదం లేకపోలేదు. కొత్త సినిమాలకు కోట్లు ఖర్చుపెట్టలేక ఓటిటిలు క్రమంగా ఇలాటి టాక్ షోల వైపు మొగ్గు చూపడం మంచి పరిణామమే కానీ ఓవర్ డోస్ కాకుండా ఉంటేనే.