YS-Jagan-Kodi-Kathi-Case-Accused-Not-To-Get-Bail-Any-Soonerఇటీవలే జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోడి కత్తి కేసులో ఛార్జ్ షీటు వేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటివరకు రహస్యంగా ఉంచిన ఈ ఛార్జ్ షీటు వివరాలు ఇప్పుడు కొన్ని వార్త ఛానెళ్ల ద్వారా బయటకు పొక్కాయి. గతంలో రాష్ట్ర పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటైన సిట్‌ ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్‌లోని అంశాలనే మళ్లీ ఎన్‌ఐఏ చెప్పిందని సమాచారం. ఈ ఘటనలో ఎటువంటి కుట్రకోణం ఉన్నట్టుగా ఎన్ఐఏ ఛార్జ్ షీటులో పేరుకొనలేదు.

నిందితుడు శ్రీనివాసరావు.. జగన్‌ అభిమాని అని సానుభూతి రావాలని దాడికి పాల్పడ్డాడని సిట్ రిపోర్ట్ స్పష్టంచేసింది. సిట్ రిపోర్ట్‌తో ఎన్‌ఐఏ దాదాపుగా ఏకీభవించింది. దాడి చేసే ముందు జగన్‌తో శ్రీనివాసరావు మాట్లాడాడని తెలిపింది. ‘సర్.. మన పార్టీ 160 సీట్లు గెలుస్తుందని’ జగన్‌తో శ్రీనివాసరావు చెప్పాడని ఎన్‌ఐఏ చార్జిషీట్‌లో వెల్లడించింది. జగన్ తో సెల్ఫీ కోసం వైకాపా నాయకులతో మాట్లాడాలని తన సహా ఉద్యోగి హేమలతను శ్రీనివాసరావు కోరాడని స్పష్టంచేసింది.సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుందని, అందుకోసం తాను మాట్లాడతానని హేమలత భరోసా ఇచ్చినట్లుగా వివరించింది.

పార్టీ నేతలతో కలిసి జగన్‌ వీఐపీ లాంజ్‌లో ప్రవేశించాక.. వారికి అల్పాహారం అందించేందుకు శ్రీనివాసరావు ఫుడ్‌ కోర్టు సిబ్బందితో కలిసి లోనికి వెళ్లి ఆ తరువాత ఆయన మీద దాడి చెయ్యడంతో సెంటి మీటర్‌ పొడవు.. అర సెంటిమీటర్‌ వెడల్పు.. మూడున్నర సెంటిమీటర్‌ లోతు గాయమైనట్లు ఎన్ఐఏ ఛార్జ్ షీటు లో తెలిపింది. డాక్టర్‌ ఇచ్చిన నివేదికను ఎన్‌ఐఏ ప్రస్తావించింది. ఈ విషయంగా అనేక ఆరోపణలు చేసిన వైకాపా ఇప్పుడు ఎన్‌ఐఏ ఛార్జ్ షీటుతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఇందులో కచ్చితంగా కుట్రకోణం ఉందని ఇప్పటిదాకా వారి ఆరోపణ. పైగా నిందితుడు వైఎస్సాఆర్ కాంగ్రెస్ సానుభూతిపరుడు అని తేలితే మరింత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పటిదాకా టీడీపీ వారు చేస్తున్న ఆరోపణలకు బలం వస్తుంది.