Balakrishna-KS-Ravi-Kumar-Movie-Cancelledరాష్ట్రమంతా ఫ్యాన్ గాలి వీచింది. ఆ గాలిలో సైకిల్ కకావికలం అయిపోయింది. అయితే ఇంతటి వేవ్ ఎలక్షన్ లో కూడా బాలకృష్ణ ఒక్క మగాడిలా నిలబడ్డాడు. రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ కంచుకోటాలు కదిలిపోయాయి. మంత్రులు కూడా చాలా మంది ఓడిపోయారు. ఈ సమయంలో గెలవడం, మునుపటి మెజారిటీ కంటే మెరుగు పర్చుకోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. అయితే మొట్టమొదటి సారిగా పురంపై వైఎస్సాఆర్ కాంగ్రెస్ జండా ఎగురవెయ్యాలి అనుకున్న జగన్ ను ఇది నిరాశపరిచింది.

ఈ సీటు ఓడిపోవడానికి జగన్ కూడా ఒక కారణమే. చివరి నిముషం వరకూ ఇక్కడ అభ్యర్థిని తేల్చలేదు. మాజీ పోలిస్ అయిన ఇక్బాల్ అహ్మద్ ముందుగా వేరే నియోజకవర్గాలకు ఇన్ చార్జిగా వ్యవహరించారు. ఆయనను చివరి నిముషంలో హిందూపురం నుంచి ఎమ్మెల్యేగా బరిలోకి దింపారు. అయితే అక్కడ నుంచి నెగ్గుకురాలేకపోయారు. అయితే ఇక్బాల్ అహ్మద్ ను సపోర్టు చేసి వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుండే పని చేసుకోనిస్తే గానీ గెలవడం సాధ్యం కాదని జగన్ అనుకున్నారట.

దీనితో ఇక్బాల్ అహ్మద్ కు ఎమ్మెల్సీ పదవిని కేటాయించనున్నట్టుగా ప్రకటించారు. ఈ ఒక్క అడుగు ద్వారా మైనారిటీ కోటాను భర్తీ చేయడంతో పాటు, హిందూపురంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పనిచేసుకోవడానికి వీలు కల్పించినట్టు అయ్యింది. ఎన్టీఆర్ టీడీపీ పార్టీ స్థాపించిన నాటి నుండి 2014 వరకు జరిగిన తొమ్మిది ఎన్నికలలో వరుసగా ఆ పార్టీ అభ్యర్థులే గెలుస్తూ వస్తున్నారు. స్వర్గీయ నందమూరి తారకరామారావు ఇక్కడ నుండి మూడు సార్లు, నందమూరి హరికృష్ణ ఒక సారి, ఇప్పుడు బాలయ్య రెండు సార్లు ఎన్నికయ్యారు. ఈసారైనా పురం మీద వేరే జండా ఎగురుతుందేమో చూడాలి.