new twist in actress bhavana molestation caseమలయాళ బొమ్మ భావనపై జరిగిన దాడి కేసులో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసులో కుట్ర కోణం ఉందని, పక్కా ప్రణాళికతోనే దాడి జరిగిందని, దీని వెనక సినీ ప్రముఖుల హస్తం ఉందనే కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు బయటకు వస్తున్నాయి. వృత్తి పరమైన శత్రుత్వంతోనే దాడి జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. మాజీ కారు డ్రైవర్, రౌడీషీటర్ అయిన సునీల్‌ తో కుమ్మక్కైన కొందరు సినీ ప్రముఖులు, కావాలనే ఈ పని చేయించి ఉంటారని, ఈ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు కేరళ క్రైం బ్రాంచ్ ఐజీ దినేంద్ర కశ్యప్ తెలిపారు.

భావనపై దాడి చేసిన తర్వాత సునీల్ కుమార్ సినీ పరిశ్రమలోని కొందరితో ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులకు ఆధారాలు లభించాయి. దీంతో వారి జోక్యం పైనా విచారణ జరుపుతున్నట్టు ఐజీ తెలిపారు. లైంగిక దాడికి గురైన హీరోయిన్‌ కు, ఓ హీరోకు మధ్య వైరం ఉందని, ఆ కారణంగా ఆమె పరిశ్రమలో వివక్షకు గురవుతున్నారని నటి మంజు వారియర్ ఆరోపణలు గుప్పించారు. మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) నిర్వహించిన సమావేశంలో ఆమె కేరళ సినీ పరిశ్రమపై నిప్పులు చెరిగారు.

సినీ పరిశ్రమ పూర్తిగా మాఫియా గుప్పిట్లో ఉందని, హీరోయిన్‌ పై లైంగిక దాడి ఘటనలో కుట్ర ఉందని, హీరోతో వైరానికి, దాడికి మధ్య ఏమైనా సంబంధం ఉందేమో విచారణ జరిపించాలని బీజేపీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు వి.మురళీధరన్ వ్యాఖ్యానించారు. మరోవైపు పరారీలో ఉన్న సునీల్ కుమార్ సహా ముగ్గురు నిందితులు ముందస్తు బెయిల్ కోసం కేరళ హైకోర్టును ఆశ్రయించడం విశేషం. హీరోయిన్ డ్రైవర్ వాంగ్మూలంతో తమను అన్యాయంగా కేసులో ఇరికిస్తున్నారని వారు ఆరోపిస్తున్నారు.

ఈ పిటిషన్ మంగళవారం నాడు విచారణకు రానుంది. మరోవైపు పోలీసుల అదుపులో ఉన్న ప్రస్తుత కారు డ్రైవర్ కొత్త విషయాలు వెల్లడిస్తున్నాడు. లైంగిక దాడి ఫొటోలు, వీడియోలు చూపించి బ్లాక్‌మెయిల్ చేసి 30 లక్షలు వసూలు చేయాలని ప్లాన్ చేసినట్టు తెలిపాడు. సునీల్ తన భార్యను కిడ్నాప్ చేయబోతే, అదృష్టవశాత్తు ఆమె తప్పించుకుందని నిర్మాత సురేశ్ కుమార్ తెలిపారు. సంచలనంగా మారిన ఈ కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని సర్వత్రా డిమాండ్ వ్యక్తమవుతోంది.