TRS-and-YCP New Trend in Politicsఏపీ, తెలంగాణ రాష్ట్రాల మద్య విభేధాలున్నప్పటికీ వాటిని నడిపిస్తున్న అధికార వైసీపీ, టిఆర్ఎస్‌ పార్టీల నేతల మద్య సన్నిహిత సంబంధాలే ఉన్నాయని అందరికీ తెలుసు. తెలంగాణ మంత్రి కేటీఆర్‌ ఏపీ గురించి చులకనగా మాట్లాడిన రోజే, ఏపీ పర్యాటకశాఖ మంత్రి ఆర్‌కె. రోజా తెలంగాణ సిఎం కేసీఆర్‌ ఇంటికి వెళ్ళి వారి ఆశీర్వాదం తీసుకు రావడం ఓ చిన్న నిదర్శనం.

అయితే తెలంగాణ సిఎం కేసీఆర్‌, మంత్రులు వైసీపీ ప్రభుత్వ అసమర్దత గురించి చులకనగా మాట్లాడుతున్నా ‘మనవాళ్ళు’ ఎందుకు వారితో రాసుకుపూసుకు తిరుగుతున్నారు?అంటే బహుశః మనవాళ్ళకి అక్కడ భారీగా ఆస్తులు, వ్యాపారాలు, కాంట్రాక్టులు, పెట్టుబడులు ఉన్నందున కావచ్చు. అది వేరే విషయం.

వైసీపీ, టిఆర్ఎస్‌ నేతల మద్య సత్సంబంధాలున్నప్పుడు వారి మద్య కీచులాటలు కూడా నిజమని నమ్మలేము. కనుక వారి కీచులాటలకు ఓ పరమార్ధం ఉంటుంది. రాజకీయాలలో గత కొన్నేళ్ళుగా ఓ ట్రెండ్ నడుస్తోంది.

రెండు పార్టీలు రాజకీయంగా లబ్ది పొందాలన్నా లేదా ఓ సమస్య నుంచి ప్రజల దృష్టి మళ్ళించాలన్నా పరస్పరం సహకరించుకొనే బదులు శత్రువుల్లా కత్తులు దూసుకొంటాయి. దాంతో ఆ పార్టీలను అభిమానించే ప్రజలు వాటి ప్రత్యర్ధి పార్టీ విమర్శలు, ఆరోపణలను విని తమ అభిమాన పార్టీకి మరింత గట్టిగా మద్దతు ఇచ్చేస్తుంటారు.

గత ఏడాది జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో ఇది ప్రత్యక్షంగా కనబడింది. ఆ ఎన్నికలకు ముందు… ఆ తరువాత రాసుకు పూసుకు తిరుగుతున్న టిఆర్ఎస్‌, మజ్లీస్‌ పార్టీ నేతలు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల గంట మ్రోగగానే, హటాత్తుగా శత్రువులుగా నటిస్తూ పరస్పరం కత్తులు దూసుకోవడం మొదలుపెట్టారు.

బిజెపి కూడా ఆ రెండు పార్టీలపై కత్తులు దూస్తూ ‘పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తాం…’ అంటూ సినిమా డైలాగులు చెప్పింది. మూడు పార్టీలు బద్ధ శత్రువుల్లా పోట్లాడుకోవడంతో మజ్లీస్‌పై ద్వేషంతో హిందూ ఓటర్లు బిజెపికి, బిజెపిపై ద్వేషంతో ముస్లిం ఓటర్లు మజ్లీస్‌కు, ఆ రెండు పార్టీలు టిఆర్ఎస్‌ను దూషించినందుకు తెలంగాణ ఓటర్లు టిఆర్ఎస్‌ పార్టీలకు ఓట్లువేసేశారు!

పంచతంత్రంలో ‘మిత్రలాభం’ అనే మాట విన్నాము కానీ ఇప్పుడు ‘శత్రులాభం’ అనే మరో కొత్త మాట కూడా చేర్చాల్సి ఉంది.

ఇప్పుడు వైసీపీ, టిఆర్ఎస్‌లు కూడా ఆ శత్రులాభాన్ని వాడుకొంటున్నట్లు అర్దమవుతోంది. టిఆర్ఎస్‌ నేతలు ఏపీని, ప్రభుత్వాన్ని తిడుతుంటే ఇక్కడ ఆంద్రా సెంటిమెంట్, అలాగే వైసీపీ నేతలు తెలంగాణను, ప్రభుత్వాన్ని తిడుతుంటే అక్కడ తెలంగాణ సెంటిమెంట్ పెరుగుతుంది.

ఒకవేళ ఎన్నికలు జరుగుతుంటే ఆ సెంటిమెంటుతో వైసీపీ, టిఆర్ఎస్‌లకు లబ్ది కలిగి ఉండేది. కానీ ఎన్నికలు లేని సమయంలో ఈ ఉత్తుత్తి కీచులటలతో సమస్యలను పక్కదారి పట్టించడానికి ఉపయోగపడతాయి. ఇటీవల కేటీఆర్‌ ఏపీని ఉద్దేశ్యించి చులకనగా మాట్లాడటం కూడా బహుశః అటువంటిదే కావచ్చు.

ఆ గొడవ చల్లారిపోయిన తరువాత మళ్ళీ సాక్షి, నమస్తే తెలంగాణ పత్రికలు అచ్చం రెండు రాజకీయ పార్టీలలాగా కీచులాటలు మొదలుపెట్టడం గమనిస్తే అవి ఆ వేడిని చల్లారిపోకుండా రగిలిస్తున్నట్లు అనుమానం కలుగుతుంది. అయితే దాంతో వైసీపీ, టిఆర్ఎస్‌ పార్టీలు ఏం ప్రయోజనం ఆశిస్తున్నాయనేది రాబోయే రోజుల్లో తెలుస్తుంది