New Chief Secretary LV Subrahmanyam - Chandrababu- Naiduఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తలపెట్టిన మంత్రివర్గ సమావేశంపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈ సాయంత్రానికి ఎన్నికల సంఘం నుంచి అనుమతి వస్తేనే రేపు మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉంది. ఈ నెల 10న సాయంత్రం కేబినెట్‌ అజెండా అంశాల నోటీసును కేంద్ర ఎన్నికల సంఘానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ద్వివేది పంపారు. నోట్‌ అందిన రెండు పని దినాల్లో తమ అభిప్రాయం చెబుతామని ఎన్నికల సంఘం పేర్కొంది.

దీంతో ఈసీ నిర్ణయం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎదురుచూస్తోంది. మరోవైపు ఈ విషయంపై చర్చించేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం భేటీ అయ్యారు. ఎన్నికల సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మార్చి ఎన్నికల సంఘం ఎల్వీ సుబ్రహ్మణ్యంను ఆ స్థానంలోకి తెచ్చిన విషయం తెలిసిందే. అప్పట్లో ఆయన జగన్ కేసులలో నిందితుడని ముఖ్యమంత్రి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఛార్జ్ తీసుకున్నాకా ఆయన ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కూడా కలవలేదు,

ఒక పత్రికా ఇంటర్వ్యూలో ఏకంగా ముఖ్యమంత్రి ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కాకపోయినా ఆయనకు అధికారాలు లేవని ఎల్వీ సుబ్రహ్మణ్యం చెప్పడం చర్చనీయాంశం అయ్యింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నివేదికలు తయారు చేసి కేంద్రానికి పంపుతున్నారన్న అభియోగాలు కూడా ఆయన మీద ఉన్నాయి. ఈ క్రమంలో వారు ఇరువురు మొదటి సారి భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది. మంత్రి వర్గ భేటీకి ఈసీ అనుమతి రాకపోతే రేపు మధ్యాహ్నం 3 గంటలకు అధికారులతో సమీక్ష నిర్వహించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. కరవు,ఫొని తుపాను, తాగునీటి అంశాలపై నిర్వహించే ఈ సమీక్షకు సీఎస్‌తోపాటు ఆయా శాఖల కార్యదర్శులు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం.