Amala Paul Trolls‘నాకు అవ‌కాశం రాలేదు.. ఇవ్వ‌లేదు. అదే క‌నుక జ‌రిగి ఉండుంటే ప‌రిస్థితి మ‌రోలా ఉండేది’ అని కొంత మంది మాట్లాడుతుంటారు. వారు నిజంగా కూడా గొప్ప‌వారే కావ‌చ్చు. కానీ ప‌క్క వారిని త‌క్కువ అంచ‌నా వేస్తుంటారు. వారు చేసే ప‌నులు, మాట‌లు వారిని న‌లుగురులో ప‌లుచ‌న చేస్తాయే కానీ.. గొప్ప‌గా నిల‌బెట్ట‌లేవ‌నే సంగ‌తిని గుర్తించ‌లేరు. ఇప్పుడు మ‌ల‌యాళీ బ్యూటీ అమ‌లా పాల్ ప‌రిస్థితి అలాగే ఉంది. రీసెంట్‌గా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ టాలీవుడ్ సినిమా ప‌రిశ్ర‌మ‌పై త‌న అయిష్ట‌త‌ను వ్య‌క్తం చేసింది. ఆమె మాట‌లు వింటే తాను గొప్ప న‌టిని అని, త‌న‌ను టాలీవుడ్ ప‌రిశ్ర‌మ గుర్తించ‌లేద‌ని, అందుక‌నే త‌న‌కు తెలుగు సినిమాలు చేయ‌ట‌మంటే ఇష్టం లేద‌న్న‌ట్లు మాట్లాడింది.

స‌రే! ఎవ‌రి అభిప్రాయం వారికి ఉంటుంది. దాన్నెవ‌రూ త‌ప్పు ప‌ట్ట‌రు. అయితే కొంద‌రు అదే ఇండ‌స్ట్రీలో స‌క్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. అదే ఇండ‌స్ట్రీలో మ‌నం రాణించ‌లేక‌పోతే త‌ప్పు మ‌న‌దే అవుతుంది కానీ.. ఇండ‌స్ట్రీదెలా అవుతుంది. ఈ చిన్న విష‌యం అమ‌లా పాల్‌కి అర్థం కాలేదా! అని విమ‌ర్శ‌ల‌ను ఆమె ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. ప‌నిలో ప‌నిగా అమ‌లా పాల్ సినీ ఇండ‌స్ట్రీలోని హీరోల గురించి, తెలుగు సినిమాలో హీరోయిన్స్ పాత్ర‌లు ఎలా ఉంటాయ‌నే దానిపై కామెంట్స్ చేసింది. అయితే దీనికి నెటిజ‌న్స్ నుంచి ఆమెకు ఊహించ‌ని కౌంట‌ర్స్ ప‌డుతున్నాయి.

‘నేను తెలుగు సినీ ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్పుడు అక్క‌డ కొన్ని ఫ్యామిలీ కాన్సెప్ట్ ఉంద‌ని, వారే ఇండ‌స్ట్రీని డామినేట్ చేస్తున్నార‌ని అర్థ‌మైంది. వారికి మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఆ స‌మ‌యంలో వారు చేసే సినిమాలు కూడా చాలా విచిత్రంగా ఉండేవి. హీరోల‌కు ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. వారు హీరోతో ప్రేమ స‌న్నివేశాల్లో మాత్ర‌మే న‌టిస్తారు. పాట‌ల్లో, గ్లామ‌ర్ స‌న్నివేశాల్లో మాత్ర‌మే యాక్ట్ చేయ‌డానికి హీరోయిన్స్ ఉండేవారు. అవ‌న్నీ ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్ మూవీస్. దాంతో నేను ఆ ఇండ‌స్ట్రీకి పెద్ద‌గా క‌నెక్ట్ కాలేక‌పోయాను. దాంతో అక్క‌డ ఎక్కువ‌గా సినిమాలు చేయ‌లేక‌పోయాను’ అని ఇంట‌ర్వ్యూలో అమ‌లా పాల్ మాట్లాడింది.

అయితే అమ‌లా పాల్ చేసిన వ్యాఖ్య‌ల‌పై నెటిజ‌న్స్ మాత్రం సీరియ‌స్‌గానే రియాక్ట్ అవుతున్నారు. తెలుగు సినీ ఇండ‌స్ట్రీ గురించి, ఇక్క‌డ హీరోల గురించి అమ‌లా పాల్‌కు తెలియ‌దంటూ ఎద్దేవా చేస్తున్నారు. హీరోయిన్స్ అంటే తెలుగు ఇండ‌స్ట్రీలో గ్లామ‌ర్ కోస‌మే అని ఆమె చెప్పిన మాట‌ల‌కు కూడా గ‌ట్టి కౌంట‌ర్సే ప‌డుతున్నాయి. సాయి ప‌ల్ల‌వి గ్లామ‌ర్ పాత్ర‌ల్లో ఏమీ న‌టించ‌దు. కానీ ఆమెకంటూ ఓ ఫ్యాన్ బేస్ ఉంది. ఆమెను తెలుగు ప్రేక్ష‌కులు ఆద‌రిస్తున్నారుగా.. అని అంటున్నారు. నెటిజ‌న్స్ చెప్పింది నిజ‌మే. హీరోయిన్ వ‌చ్చి రాగానే.. ఆమెకు అద్భుత‌మైన పాత్ర‌ను ఇచ్చేసి ఆహా.. అబ్బో అనేయాలా! అలా ఏ ఇండ‌స్ట్రీలోనూ చేయ‌రు.

తెలుగు అగ్ర క‌థానాయిక‌లుగా పేరు తెచ్చుకున్న వారంద‌రూ హీరోయిన్స్‌గా హీరోల‌తో ఆడిపాడిన వారే.ఓ వైపు హీరోల‌తో క‌మ‌ర్షియ‌ల్ పాత్ర‌లు చేస్తూనే పెర్పామెన్స్ పాత్ర‌ల్లోనూ న‌టించారు. విజ‌య‌శాంతి నుంచి ఇప్ప‌టి న‌య‌న తార వ‌ర‌కు గ్లామ‌ర్ పాత్ర‌లు చేశారు. లేడీ ఓరియెంటెడ్ సినిమాల‌తోనూ అల‌రించి త‌మ‌దైన గుర్తింపును సంపాదించుకున్నారు. తెలుగులో అనుష్క కూడా ముందు క‌మ‌ర్షియ‌ల్ ఫార్మేట్ సినిమాల్లో న‌టించింది. త‌ర్వాత ఆమె అరుంధ‌తి, భాగ‌మ‌తి, బాహుబ‌లి వంటి సినిమాల్లో ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను మెస్మ‌రైజ్ చేసింది.

అర్థం చేసుకోవ‌టం, చూసే కోణాన్ని బ‌ట్టి ఓ విష‌యం ఆధార‌ప‌డి ఉంటుంద‌ని అమ‌లా పాల్ వ్యాఖ్య‌ల‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంద‌ని తెలుస్తోంది. తాను చేసిన ఒక‌ట్రెండు సినిమాల‌ను ఆధారంగా చేసుకుని మొత్తం ఇండ‌స్ట్రీని అంచ‌నా వేయ‌టం క‌రెక్టేనా అమ‌లా పాల్‌… అని అంటున్నారు నెటిజ‌న్స్‌.