టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ‘కుర్చీలాట’కు మూడు సినిమాలు తెరలేపాయి. మొదటి రోజు మంచి ఓపెనింగ్స్ ను తెచ్చుకుని మూడు చిత్రాలు విజయవంతంగా ముగిసాయి. అయితే తొలి రోజు వెలువడిన టాక్ ప్రకారం ఇక మున్ముందు ‘కుర్చీ’ ఎవరికి దక్కుతుందో నిర్ణయమవుతుంది. ఫస్ట్ డే పబ్లిక్ టాక్ ప్రకారం… రేసు నుండి హను రాఘవపూడి – నితిన్ ల “లై” సినిమా పక్కకు తప్పుకున్నట్టే భావించవచ్చు. మాస్ సెంటర్స్ ను ఏ మాత్రం అలరించని ఈ సినిమా ‘క్లాస్’ వర్గాలలోనూ భిన్నమైన టాక్ ను తెచ్చుకోవడంతో, రేసులో నిలబడదని ట్రేడ్ పండితులు దాదాపుగా ఖరారు చేసారు.

ఇక మిగిలింది… రానా “నేనే రాజు నేనే మంత్రి” మరియు బోయపాటి “జయ జానకి నాయక” చిత్రాలు మాత్రమే. టాక్ పరంగా రెండూ సినిమాలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, సినీ విమర్శకులు మాత్రం బోయపాటి సినిమాను ఒక మెట్టు పైకి ఎక్కించారు. తెలుగు ప్రేక్షకులకు కావాల్సిన అన్ని హంగులతో ‘జయ జానకి నాయక’ సినిమాను సిద్ధం చేసిన బోయపాటి, టార్గెట్ ఆడియన్స్ ను సంతృప్తి పరచడంలో సక్సెస్ సాధించినట్లే అన్న టాక్ వెలువడుతోంది. దీంతో బాక్సాఫీస్ ‘కుర్చీ’లో కూర్చోవడానికి “జయ జానకి నాయక” ముందు వరుసలో ఉన్న మాట వాస్తవం. ఓపెనింగ్స్ కూడా అంచనాలు వేసిన దాని కంటే ఎక్కువగానే వచ్చాయని తెలుస్తోంది.

మరో పక్కన… ఈ మూడు సినిమాలలో అత్యధిక ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న “నేనే రాజు నేనే మంత్రి” సినిమాకు టాక్ బాగానే ఉంది గానీ, సినీ విశ్లేషణలు మాత్రం అనుకూలంగా లేవు. ఫస్టాఫ్ లో కనపడని తేజ మార్క్ ‘విలనిజం’ సెకండాఫ్ లో ప్రత్యక్షం కావడంతో, సినిమా డల్ అయ్యిందన్న టాక్ వ్యక్తమవుతున్న మాట వాస్తవమే గానీ, సినిమాను డ్యామేజ్ చేసేటంత భారీ ‘నెగటివ్’ టాక్ అయితే ప్రచారంలో లేదు. అందులోనూ ప్రస్తుతం మాంచి ఊపులో ఉన్న రానా, ఈ సినిమాను ఒంటి చేత్తో గట్టేక్కిస్తాడన్న నమ్మకం ట్రేడ్ పండితుల నుండి వ్యక్తమవుతోంది. ఆ నమ్మకం ఎలా ఉందంటే… “ఎందుకంటే… వాడు జోగేంద్ర కాబట్టి..!” ఇది అర్ధం కావాలంటే సినిమా చూడాల్సిందే!